నెల్లూరు జిల్లా రాజకీయాలు అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది.. ఆనం సోదరులు! మరీ ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి మరింత ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన మీడియా ముందుకు వస్తే ప్రత్యేకమే. ఎందుకంటే, ఒక్కోసారి విచిత్రమైన గెటప్పుల్లో వస్తుంటారు, లేదంటే చర్చ ఏదో ఒక చర్చనీయం అయ్యేలా మీడియా ముందు మాట్లాడుతూ ఉంటారు. అయితే, గడచిన కొన్ని నెలలుగా ఆయన హడావుడే ఉండటం లేదు. మీడియా ముందుకు రావడం లేదు. చివరికి, కార్యకర్తలకు కూడా పెద్దగా టచ్ లో ఉండటం లేదని సమాచారం. ఇంకా చెప్పాలంటే… ఆయన నెల్లూరు కంటే.. హైదరాబాద్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన అందుబాటులో లేకపోవడంపై రకరకాల కథనాలు ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
నిజానికి, నెల్లూరులో ఏ చిన్న కార్యక్రమం జరిగినా దానికి ఆనం వస్తారు. ఎందుకంటే, దానికో సెంటిమెంట్ కూడా చెబుతారు! వివేకా చేతులు మీదుగా ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే మాంచి లాభాలు వస్తాయనేది కొంతమంది నమ్మకం. దీంతో ఏ చిన్న దుకాణం ఓపెనింగ్ ఉన్నా ఆయన్ని తప్పక పిలుస్తారు.. ఆయనా కచ్చితంగా హాజరౌతూ ఉంటారు. దీంతో ఆయన ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తారు. అయితే, గడచిన రెండు మూడు నెలలుగా ఆయన జోరు తగ్గింది. ఆయనకు ఆరోగ్యం సరిగా లేదనీ, అందుకే హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య ఓ వ్యక్తిగత కార్యక్రమంపై నెల్లూరు వచ్చినప్పుడు.. ఆయన కాస్త నీరసంగా కనిపించారని ఆయన్ని కలిసిన నేతలు అంటున్నారు!
ఇంకో కారణం కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీలో కొత్త నాయకుల చేరిక… కొంతమంది ప్రముఖ నేతలు నెల్లూరుపై దృష్టిపెట్టి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పట్నుంచే భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తుండటంతో వివేకా కాస్త వెనకబడ్డారనీ అంటున్నారు. పైగా, నెల్లూరులో ఆనం చెబితే చాలు.. ఏ పనైనా అయిపోతుందనే అభిప్రాయం ఉండేది. ఆ నమ్మకంతోనే ఆయన దగ్గరకు చాలామంది వెళ్తుంటారు. కానీ, ఇప్పుడా పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందట. అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు నెల్లూరులో గ్రిప్ పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తుండటం… అధికార వర్గాల్లో ఇప్పుడు ఆయన మాటకే కొంత ప్రాధాన్యత పెరిగేలా చూసుకుంటున్నారట! ఈ విషయం తెలియడంతో ఆనం కావాలనే ఈ మధ్య కాస్త సైలెంట్ అయిపోతున్నారని విశ్లేషించేవారు కూడా ఉన్నారు.