జగన్మోహన్ రెడ్డికి త్వరలో మరో పెద్ద షాక్ తప్పదంటున్నారు ఆనం వివేకానంద రెడ్డి. అతి త్వరలోనే కనీసం 10 మంది వైకాపా ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేసి తెదేపాలో చేరబోతున్నారని ఆయన మీడియాకి తెలిపారు. అయితే వారి పేర్లు, ఇతర వివరాలను తెలియజేయడానికి ఇష్టపడలేదు. వారందరూ కూడా జగన్ ప్రవర్తనతో విసుగెత్తిపోయే వైకాపా నుంచి బయటకు వచ్చేయాలనుకొంటున్నట్లు చెప్పారు.
ప్రస్తుత పరిస్థితులలో ఆనం మాటలని మైండ్ గేమ్ అనుకోవచ్చు అలాగని వాటిని తేలికగా తీసుకోవడానికి లేదు. ఇటువంటి ప్రచారం వలన వైకాపాలోనే కొనసాగాలనుకొనే ఎమ్మెల్యేలు కూడా ఆలోచనలోపడేలా చేయడమే దాని ఉద్దేశ్యం కావచ్చు. తెదేపాలో చేరేవారికి రూ.20-30 కోట్లు, రాజధానిలో భూములు, కాంట్రాక్టులు వగైరాలు ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డి స్వయంగా పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు కనుక పార్టీని వీడి తెదేపాలోకి వెళ్ళాలా వద్దా..అని ఊగిసలాడుతున్నవారికి తెదేపా నేతలు ఆడుతున్న ఈ మైండ్ గేమ్ తో తెదేపా వైపు మొగ్గే అవకాశం ఉంది. ఇది ఆశించిన ఫలితాలు ఇస్తున్నందునే ఆనం వంటి వారు ఎమ్మెల్యేల చేరిక గురించి మీడియాకి ప్రకటిస్తున్నారని భావించవచ్చు. ఒకవేళ నిజంగానే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే అది వైకాపాకి దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద దెబ్బే అవుతుంది.