గతేడాది టాలీవుడ్ ని షేక్ చేసిన సినిమాల్లో ‘బేబీ’ ఒకటి. ఎలాంటి అంచనాలూ లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసుని కుదిపేసింది. సాయి రాజేష్, ఎస్.కె.ఎన్‌లతో పాటుగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి పేర్లు మార్మోగేలా చేశాయి. ఇప్పుడు ‘బేబీ’ టీమ్ నుంచి మరో సినిమా వస్తోంది. అదే… ‘చెన్నై లవ్ స్టోరీ’.
ఈ చిత్రానికి ఎస్.కె.ఎన్ నిర్మాత. సాయి రాజేష్ దర్శకుడు కాదుకానీ, ఆయన కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ‘బేబీ’ చిత్రానికి సహాయకుడిగా పని చేసిన రవి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ నటించిన ‘గం గం గణేషా’ ఈనెల 31న విడుదల అవుతోంది. ఆ తరవాత ‘డ్యూయెట్’ సినిమా ఉంది. ఈ సినిమా ఇప్పటికి సగం షూటింగ్ పూర్తి చేసుకొంది. ‘డ్యూయెట్’ అవ్వగానే ‘చెన్నై లవ్ స్టోరీ’ సెట్స్‌పైకి వెళ్తుంది. మరోవైపు ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ దర్శకుడితో ఆనంద్ మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.