‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి వుంటుంది’ బేబీ ట్రైలర్ ఆరంభంలో రాసిన కొటేషన్ ఇది. ఈ మాటకు తగినట్లే బేబీ ట్రైలర్ ని ఆవిష్కరించారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ముఖ్యతారలుగా నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకుడు. ఈ నెల 14న చిత్రం విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ వదిలారు.
ఇదొక చైల్డ్ వుడ్ లవ్ స్టొరీ. ఓ అమ్మాయి అబ్బాయి చిన్నప్పటి నుంచి ఇష్టపడతారు. అబ్బాయి టెన్త్ ఫెయిల్ అయి అటో నడుపుతాడు. అమ్మాయి మాత్రం పై చదువులకు కాలేజ్ లో చేరుతుంది. తర్వాత వీరి మధ్య ప్రేమ ఎలాంటి మలుపులు తీసుకుందనేది కథ.
బేబీ ట్రైలర్ లో చూపించిన కొన్ని సన్నివేశాలు చాలా మంది జీవితాల్లో జరిగేవే. స్కూల్ లో ఓ అమ్మాయిని ఇష్టపడటం, ఆ అమ్మాయి కాలేజ్ లో చేరిన తర్వాత ఏమౌతుందో కంగారు పడటం, ఆ క్రమంలో వచ్చే అనుమానం .. ఇవన్నీ ట్రైలర్ లో కనిపించాయి. ఈ సినిమాలో చాలా పాపులరైన ‘ఓ రెండు ప్రేమ మేఘలై’ పాట ట్రైలర్ ఆర్ఆర్ లో వాడటం బావుంది.
విజువల్స్ ప్లజంట్ గా వున్నాయి. ”మాకు మీ అంత బలం లేకపోవచ్చు. కానీ గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఎవ్వడూ కొట్టలేడు” అని చివర్లో అమ్మాయి చెప్పే డైలాగ్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ ప్రేమకథలో ఇంకేదో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ వుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. టీనేజ్ ని ద్రుష్టిలో పెట్టుకొని తీసిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.