ఆనందగజపతిరాజుకు అసలైన వారసులం తామేనని.. ఆయన భార్య, కుమార్తె తాజాగా మీడియా ముందుకు రావడం కలకలం రేపుతోంది. ఆనందగజపతిరాజు భార్య సుధాగజపతిరాజు, ఆయన కుమార్తె ఊర్మిళా గజపతిరాజులు విశాఖలో మీడియాలో సమావేశం పెట్టారు. ఆనందగజపతిరాజు స్వహస్తాలతో రాసిన వీలునామాను చూపించారు. సంచయిత విషయంలోనూ కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఆనందగజపతిరాజు వారసురాలు అనడానికి ఒక్క ఆధారం చూపించాలని డిమాండ్ చేశారు.
సంచయితను ఆనందగజపతిరాజు వారసురాలిగా గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతల్ని అప్పగించేసింది. ఆ తర్వాతే అసలు కథ ప్రారంభమయినట్లుగా తెలుస్తోంది. ఆనందగజపతిరాజుకు సంబంధించిన ఆస్తుల విషయంలో సంచయిత కొత్తగా లిటిగేషన్లు పెడుతున్నారన్న ఆరోపణలు కుటుంబసభ్యులనుంచి వస్తున్నాయి. చెన్నైలో ఉన్న ఓ ఆస్తిని కొంత కాలం క్రితం విక్రయించారు. అయితే.. అలా విక్రయించడం చట్ట విరుద్ధమంటూ.. విశాఖలో సంచయిత కేసు పెట్టారు. విశాఖ పోలీసులు లండన్లో ఉన్న సుధా, ఊర్మిళా ఆనందగజపతిరాజులకు నోటీసులు పంపారు. ఈ నోటీసులతో ఆశ్చర్యపోయిన సుధా, ఊర్మిలా గజపతిరాజులు.. విశాఖకు వచ్చి.. సంచయిత గురించి ప్రెస్మీట్ పెట్టారు.
1991లోనే ఆనందగజపతిరాజు నుంచి సంచయిత తల్లి ఉమా గజపతిరాజు విడాకులు తీసుకున్నారని, ఆస్తుల పంపకాలూ పూర్తయ్యాయని, అందుకు అన్ని ఆధారాలూ ఉన్నాయంటున్నారు. ఆరోజు తన తండ్రి స్వహస్తాలతో రాసిన వీలునామా ఆధారంగా ప్రస్తుతం ఉన్న ఆస్తులు తమకే చెందుతాయన్నారు. సంచయితకు రాసి ఇచ్చిన ఆస్తులు.. ఆమెకు వివాహం అయిన తర్వాతనే అమ్ముకునేలా హక్కులు కల్పించారని.. కామె ఆమె.. వివాహం కాకుండానే..అమ్ముకుంటున్నారని … వారు ఆరోపిస్తున్నారు. వారసత్వ హక్కుల కోసం న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. సుధా, ఊర్మిళా గజపతిరాజులు.. లండన్ నుంచి రావడం.. తామే అసలైన వారసులం అని వాదిస్తూండటంతో.. ఈ వ్యవహారం కొత్త మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.