విజయ్ ఆంటోనీ… బిచ్చగాడుతో బహు పాపులర్ అయిపోయిన హీరో. అంతకు ముందు తీసిన సలీమ్, నకిలీ కూడా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కినవే. సంగీత దర్శకుడిగా అడుగుపెట్టిన విజయ్.. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా రాణిస్తున్నాడు. తనేం హీరో మెటీరియల్ ఏం కాదు. కానీ తనకు నప్పే కథల్ని ఎంచుకొని, కేవలం కథా బలంతో విజయాలు అందుకొంటున్నాడు. ఈ ఫార్ములా మనవాళ్లకు బాగా నచ్చినట్టుంది. అందుకే.. ఆ రూటులో కొంతమంది దర్శకులు నటులుగా మారే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘ప్రతినిధి’ తో రచయితగా గుర్తింపు తెచ్చుకొన్నాడు ఆనంద్ రవి. ఇప్పుడు `నెపోలియన్`తో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాలో కథానాయకుడూ ఆయనే. ట్రైలర్, అందులోని కాన్సెప్ట్ ఆకట్టుకొంటున్నా.. `ఈ ప్లేసులో మరో హీరో ఉంటే బాగుణ్ణు కదా` అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఏమో… ఆనంద్ రవి.. మరో విజయ్ ఆంటోనీ కావొచ్చు గా. ఎవరు చెప్పగలరు?? ట్రైలర్లో దమ్ము కనిపిస్తోంది. డైలాగులు బాగున్నాయి. తెర వెనుక ఆనంద్ ఏదో మ్యాజిక్ చేశాడనిపిస్తోంది. తెర ముందు కూడా ఆ మ్యాజిక్ కనిపిస్తే.. తెలుగు తెరకు రైటర్ కమ్ దర్శకుడు కమ్ నటుడు దొరికేసినట్టే. కథాబలం ఉన్నా.. నటీనటుల పరంగా బలం లేకపోతే.. `నెపోలియన్`లో పెద్ద తప్పు కాస్టింగ్దే అవుతుంది. మరి ఆ తప్పుని ఆనంద్ మోయగలడా?? దర్శకుడిగా, రచయితగా ఫెయిల్ అయినా, అవ్వకున్నా – నటుడిగా నిలదొక్కుకోవాలన్నది ఆనంద్ ప్రయత్నం. మరి ఏం జరుగుతుందో చూడాలి.