మాజీ మంత్రి, ఎంపి పూసపాటి ఆనందగజపతి రాజు ఈరోజు ఉదయం విశాఖలోని మణిపాల్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు సోదరుడు. ఆనందగజపతి రాజు 1983లో ఎన్టీఆర్ పిలుపు అందుకొని తెదేపాలో చేరారు. ఆయన హయంలోనే విద్యా, ఆరోగ్య శాఖలకు మంత్రిగా పనిచేసారు. బొబ్బిలి నుంచి రెండు సార్లు ఆయన లోక్ సభకు ఎన్నికయ్యారు. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్య క్షేత్రాలయిన సింహాచలం, రామతీర్దాలు, అరసవల్లి మరియు శ్రీకూర్మం, పైడితల్లమ్మ దేవాలయాలకి ఆయన అనువంశిక ధర్మకర్తగా వ్యవహరించారు. ఆయన విద్య ద్వారానే సమాజంలో మార్పు కలిగి అబివృద్ధి సాధించవచ్చని బలంగా నమ్మిన వ్యక్తి. అందుకే ఆయన మాన్సాస్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి విజయనగరంలో నిరుపేద విద్యార్ధుల కోసం స్కూళ్ళు, జూనియర్, డిగ్రీ కాలేజీలు నడిపిస్తున్నారు. దాని అద్వర్యంలోనే విజయనగరంలో మహారాజ ఇంజనీరింగ్ కాలేజిని కూడా ఏర్పాటు చేసారు. వారి వంశ ప్రతిష్టలు, పేద ప్రజల పట్ల వారు కనబరిచే అభిమానం, వారి దాతృత్వగుణం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో ముఖ్యంగా వారి స్వస్థలమయిన విజయనగరం జిల్లాలో ప్రజలు గజపతి సోదరులిరువురుని చాలా గౌరవిస్తారు.