చైనా వైరస్‌కు చెక్ పెట్టిన ఆనందయ్య..! మెడికల్ మాఫియాకు చుక్కలు చూపిస్తున్న ఆయుర్వేదం..! ఎవరికీ లొంగని వైరస్‌ను అంతమొందించేసిన సామాన్యుడు..! .. ఇలా లెక్కకు మిక్కిలి ప్రచారాలతో మూడు రోజుల నుంచి నెల్లూరుకు చెందిన బొనిగె ఆనంద్ ఆనే వ్యక్తి పేరు మార్మోగిపోతోంది. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో వీడియోలు వెల్లువెత్తాయి. ఆయన తయారు చేసే మందు ఎంత మహత్తరమైనదో చెబుతూ.. ఇదిగో.. చచ్చిపోబోతున్న నన్ను ఆ మందు కాపాడిందని ఒకరు… డెభ్బైల్లో ఉన్న ఆక్సిజన్ లెవల్స్‌ను.. క్షణాల్లో పెంచేసిన మహా మందు అంటూ ఇంకొకరు.. వరుసగా వీడియోలు పోస్ట్ చేశారు. సోషల్ మీడియా అంతా ఆ మందు మహత్తు గురించిన విశేషాలే.
ఈ ప్రమోషన్ ఓవైపు ఇలా ఉండగా… మరో వైపు ఆ మందు ఆయుర్వేదం అంటూ ప్రచారం చేసి.. ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున జనం వచ్చేలా చేయగలిగారు. చివరికి అటూ ఇటూచేసి.. ఆ మందును ఎవరికీ ఇవ్వకుండా అడ్డుకోగలిగారు. పది రోజుల పాటుపంపిణీని నిలివేశారు. ఏకంగా ఐసీఎంఆర్, ఆయుష్ శాఖల్ని రంగంలోకి దింపి పరిశీలన ప్రారంభించారు. పరిశోధన ఫలితాలు పది రోజులు పడుతుందని అప్పటి వరకూ మందు పంపిణీని నిలిపివేశామని చెప్పి.. ఆ ఆనందయ్యను తీసుకెళ్లి పోలీస్ కస్టడీలో పెట్టారు. అరెస్ట్ చేశారన్న గగ్గోలు రేగింది. అయితే అరెస్ట్ చేయలేదని పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చామని పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు.
మరో వైపు ఇప్పుడు ఆనందయ్య మందు మీద సోషల్ మీడియాలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒకరు ఆయనకు మద్దతుగా.. మరొకరు ఆయనకు వ్యతిరేకంగా చర్చలు పెడుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లోనూ అదే పరిస్థితి. అన్నీ చర్చిస్తున్నారు. రెండు వర్గాలుగా సోషల్ మీడియా విడిపోయింది. ఒకరు ఆనందయ్యకు మద్దతు.. మరొకరు..ఆయన మందుపై శూలశోధన చేసి విమర్శలు చేయడం. లాక్ డౌన్ కారణంగా ఖాళీగా ఉంటున్నారేమో కానీ.. చర్చ మాత్రం మామూలుగా సాగడం లేదు. ఫోన్లలోనూ అదే అంశంపై చర్చిస్తున్నారు.
ఆ మందు అద్భుతం అంటూ నిన్నటి వరకూ ఏకపక్షంగా ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు.. ఒక్కొక్కటిగా మళ్లీ మైనస్ పాయింట్స్ వెక్కి వస్తున్నాయి. ఆ మందు తీసుకున్న వాళ్లు కోలుకోలేదని.. వారి పరిస్థితి సీరియస్‌గా మారిందని వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ మందులో శాస్త్రీయత లేదని పంపిణీ చేయవద్దని హేతువులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. కొంత మంది నమ్మకంతోనే.. వ్యాధి నయం అవుతుందని.. భయమే ప్రధాన లక్షణం అయిన కరోనాకు ఆనందయ్య మందు కరెక్టేనంటున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయం చొరబడింది. అక్కడి వైసీపీ ఎమ్మెల్యే ఆనందయ్యను గుప్పిట్లో పెట్టుకున్నారు. ప్రభుత్వం పంపిణీకి అనుమతి ఇచ్చిందంటూ… హడావుడి చేస్తున్నారు. ఆనందయ్యకు వైసీపీ నాయకుడు అనే ముద్ర వేశారు. చివరికి ఈ ఆనందయ్య మందు కథ ఎటు తిరుగుతుందో కానీ ఇప్పుడు మాత్రం కాలక్షేపం అయిపోతోంది.