ఇది వరకు హారర్ సినిమా అంటే.. కేవలం హారరే ఉండేది. ఓ ఇల్లు.. దెయ్యం.. భయం… వీటి చుట్టూ కథలు తిరిగేవి. ఆ తరవాత హారర్‌కి కామెడీ మిక్స్ అయ్యింది. హారర్ కామెడీ జోనర్లో చాలా సినిమాలొచ్చాయి. అందులో హిట్లు వెదికితే పది కూడా కనిపించవు. కానీ… తీసిన సినిమాలు వందలాది ఉన్నాయి. హారర్ కామెడీ సినిమా అనగానే థియేటర్‌కి పరిగెట్టుకొని వెళ్లే రోజులు కూడా పోయాయి. అందుకే తెలుగు సినిమా ట్రెండ్ మార్చింది. హారర్‌లో కొత్త కథల వేట మొదలెట్టింది. `ఆనందో బ్రహ్మ` అందుకు శ్రీకారం చుట్టబోతోందేమో అనిపిస్తోంది. ఇదీ దెయ్యం సినిమానే. కాకపోతే దెయ్యాలు మనుషుల్ని భయపెట్టవు. మనుషుల్ని చూసి దెయ్యాలే భయపడతాయి. కాన్సెప్ట్ ఏదో కొత్తగానే అనిపిస్తోంది. ట్రైలర్లు కూడా బాగున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ప్రభాస్ రావడంతో ఈ సినిమా గురించి ఆడియన్స్‌కి తెలిసింది. ఈనెల 18న థియేటర్లలో భయపడే దెయ్యాన్ని చూడొచ్చు. ఈ సినిమా గనుక హిట్టయితే.. హారర్ సినిమాల్లో కొత్త ట్రెండ్ మొదలైనట్టే. కనీసం కొత్తగా అయినా ఆలోచించే అవకాశాలున్నాయి. గతవారమే 3 సినిమాలు విడుదలయ్యాయి. అందుకే ఈ వారం ఆనందో బ్రహ్మకి సోలో రిలీజ్ దొరికింది. ఈ అవకాశాన్ని ఎంత వరకూ క్యాష్ చేసుకొంటుందో చూడాలి.