తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5
హారర్ కామెడీ కథలకి పెట్టింది పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీ. కథలోనో, కథనంలోనో కాస్త కొత్తదనం ఉందంటే చాలు, ప్రేక్షకుడు ఆ సినిమాల్ని విజయతీరాలకి చేరుస్తుంటాడు. ఒకప్పుడు చిన్న చిత్రాలకే పరిమితమైన ఈ కథలపై ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ప్రేమ పెంచుకొంటున్నారు. అయితే హారర్ కామెడీ కథ అంటే ఎక్కువగా దెయ్యాల చుట్టూనే నడుస్తుంటాయి. అనగనగా ఓ బంగ్లా, ఆ ఇంట్లో దెయ్యం… ఉన్నట్టుండి కనిపించడం భయపెట్టడం అనే ఫార్మెట్‌లోనే సాగుతుంటాయి కథలు. వాటిలోకే బాగా భయపడేవాడినో, లేదంటే భయం లేదంటూ బిల్డప్ ఇస్తూ లోపలికి వెళ్లి ఆ తర్వాత ఇబ్బంది పడేవాడినో చూపిస్తూ నవ్వులు కూడా పూయిస్తుంటారు. ఎటొచ్చీ ప్రతి సినిమాలోనూ దెయ్యాల్ని చూసి మనుషులే భయపడిపోతుంటారు. అలా కాకుండా మనుషుల్ని చూసి దెయ్యాలు భయపడితే ఎలా ఉంటుందనే ఓ డిఫరెంట్ కాన్సెప్టుతో దర్శకుడు మహి వి.రాఘవ్ `ఆనందో బ్రహ్మ` తీసి ప్రచారం చేశాడు. అందులో తాప్సి నటించడం, ప్రభాస్‌లాంటి స్టార్ కథానాయకుడు ప్రమోషన్ ఈవెంట్లో కనిపించడం వంటి కారణాలతో విడుదలకి ముందే ఆ సినిమాకి మంచి హైప్ వచ్చింది. మరి మనుషులు దెయ్యాల్ని ఎలా భయపెట్టారు? ఈ కాన్సెప్ట్ పాచిక పారినట్టేనా? తదితర విషయాలు తెలియాలంటే ముందు మనం కథలోకి వెళ్లాల్సిందే..
* కథ
రాము (రాజీవ్ కనకాల) మలేషియాలో స్థిరపడిన ఓ హైదరాబాద్ వ్యక్తి. తన అమ్మానాన్నలు విహారయాత్రలకోసం ఉత్తరాఖండ్ వెళ్లి తిరిగి రాలేందంటూ బాధపడుతుంటాడు. ఎంతకీ వాళ్లు రాకపోవడంతో ఉన్న తన ఇంటిని అమ్మేసి మలేషియాకి వెళ్లిపోవాలనుకొంటాడు. అయితే ఆ ఇల్లు కొనడానికి వచ్చినవాళ్లంతా కూడా దెయ్యం ఉందంటూ భయపడిపోతుంటారు. తక్కువ ధరకు ఇస్తేనే కొంటామని చెబుతుంటారు. ఆ విషయం బార్లో పనిచేసే సిద్ధు (శ్రీనివాస్‌రెడ్డి)కి తెలుస్తుంది. తనకి అర్జంటుగా డబ్బు అవసరం ఉండటంతో ఆ ఇంట్లో దెయ్యాల్లేవని నేను నిరూపిస్తానని, అందుకోసం కొన్నాళ్లు ఆ ఇంట్లోనే ఉంటానని చెబుతాడు. అందుకోసమని తనకి కొంత కమిషన్ ఇస్తే సరిపోతుందంటాడు. ఆ డీల్‌కి రాము ఒప్పుకోవడంతో సిద్ధుతోపాటు, తనలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న రాజు (వెన్నెలకిషోర్), బాబు (షకలక శంకర్), తులసి (తాగుబోతు రమేష్) కలిసి ఇంట్లోకి వెళతారు. మరి లోపలికి వెళ్లాక వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ ఇంట్లో నిజంగానే దెయ్యాలున్నాయా? ఇంతకీ ఆ దెయ్యాల కథేమిటి? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.
* విశ్లేషణ
ఒక కొత్త కాన్సెప్టుతో తెరకెక్కిన సినిమా ఇది. దెయ్యాలు, మనుషులు, భయం, కామెడీ… ఈ ముడిసరుకుంతా మామూలే అయినా వాటిని వాడుకొన్న విధానం మాత్రం కొత్తగా ఉంటుంది. దెయ్యాల్ని చూసి మనుషులు భయపడతారో లేక మనుషుల్ని చూసి దెయ్యాలు భయపడతాయో తెలియని పరిస్థితి ఈ సినిమాలో. ఒకసారి వాళ్లు భయపడటం, ఒకసారి వీళ్లు భయపడటం వంటి సన్నివేశాలతో సినిమా పరుగులు పెడుతుంటుంది. దాంతో ఓ కొత్త రకమైన వినోదం పండింది. సగటు హారర్ సినిమాల మీటర్లోనే కథ, సన్నివేశాలు మొదలైనా ఆ తర్వాత వచ్చే మలుపులు సినిమా గమనాన్ని స్పష్టం చేస్తాయి. ఆరంభ సన్నివేశాలు, పాత్రల ఫ్లాష్ బ్యాక్‌లు ఫస్ట్‌హాఫ్‌లో కాస్త బోర్ కొట్టించినా సెకండ్ హాఫ్‌లో సినిమా గాడిన పడుతుంది. శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిషోర్, తాగుబోతు రమేష్, షకలక శంకర్ గ్యాంగ్ చేసే సందడి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. దెయ్యాల ఇంట్లోకి అడుగుపెట్టిన నలుగురికీనూ, దెయ్యాలుగా మారి ఇంట్లో ఉన్నవాళ్లకీ ఇందులో ఓ కథ ఉంటుంది. దెయ్యాలుగా ఎందుకు మారారనే విషయం క్లైమాక్స్ ట్విస్ట్‌లో భాగంగా బయటకొస్తుంది. అందులో రాజీవ్ కనకాల పాత్రలోని కొత్త కోణం కనిపిస్తుంది. సగటు హారర్ కామెడీకథలకి భిన్నంగా ఈ సినిమా వినోదం పంచుతుంది. అయితే పలు హాలీవుడ్ చిత్రాలతో పాటు, టాలీవుడ్లో తెరకెక్కిన `మంత్ర` సినిమాల ప్రభావం కూడా దర్శకుడిపై బలంగా ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది.
* నటీనటులు
తారాగణంలో తాప్సి ఉండటంతో ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే ఆమె పాత్రకి అంత ప్రాధాన్యం లేదు. కేవలం లుక్ పరంగా మాత్రమే ఆకట్టుకుంది. శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెలకిషోర్, తాగుబోతు రమేష్, షకలక శంకర్ పోషించిన పాత్రలే సినిమాకి బలంగా నిలిచాయి. రాజీవ్ కనకాల పాత్ర థ్రిల్‌ని కలిగిస్తుంది. ఇందులో చాలామంది నటీనటులు కనిపిస్తారు. అడుగడుగునా ఓ కొత్త పాత్ర ప్రవేశిస్తుంటుంది. అయితే మెయిన్ క్యారెక్టర్లు మినహా మిగిలిన క్యాలెక్టర్లు పెద్దగా ప్రభావం చూపించవు.
* సాంకేతికంగా
సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులు పడతాయి. సంగీతం ఫీల్‌ని పెంచింది. హారర్ సినిమాలకి తగ్గట్టుగా, ఆ ఫీల్‌ని మెంటైన్ చేసింది కెమెరా పనితనం. కథ థిన్‌గా అనిపించినప్పటికీ దాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దిన విధానంలో దర్శకుడు మహి వి.రాఘవ్‌కి మంచి మార్కులు పడతాయి. క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులకి థ్రిల్ కలిగిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
* ఫైనల్ టచ్
హారర్ కామెడీ కథల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించిన సినిమా `ఆనందో బ్రహ్మ`. తాప్సి ఓ మంచి సినిమాలో భాగమౌతూ రీ ఎంట్రీ ఇచ్చింది. మనుషుల్ని చూసి దెయ్యాలు కూడా భయపడతాయని, ఆ రూట్లోనూ కథలు రాసుకోవచ్చని సినిమా ఇండస్ట్రీకి మరో దారిని చూపించే అవకాశమున్న సినిమా ఇది.
తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5