దేశంలో అత్యంత సంపన్నుడైన పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ ఓ అద్భుతం చేశాడు. క్రానిక్ ఆస్తమా మందుల ప్రభావం వల్ల అతడు భారీ కాయంతో ఇబ్బంది పడేవాడు. అతడు నడుస్తుంటే పర్వతం కదిలినట్టు ఉంటుందని కామెంట్ చేసే వాళ్లు. అలాంటి వాడు, తన 21వ బర్త్ డే నాడు స్లిమ్ గా నాజూగ్గా కనిపించాడు. అందరికీ ఆశ్చర్యం కలిగించాడు. సహజమైన పద్ధతిలో ఒకటీ రెండూ కాడు, ఏకంగా 108 కిలోల బరువు తగ్గడం రికార్డే.
బరువు తగ్గడానికి లైపో చేయించుకోవడం ఈ మధ్య ఎక్కువైంది. ఒక్కోసారి ఇది ప్రాణాంతకంగా మారుతుంది. అనంత్ అంబానీ మాత్రం అలా చేయలేదు. నిపుణుడైన ట్రైనర్ పర్యవేక్షణలో నడక, యోగా, ఇతర వ్యాయామాల ద్వారా 18 నెలల్లోనే 108 కిలోల బరువు తగ్గాడు. తిండి విషయంలో కఠిన నియమాలు పాటించాడు. కొవ్వు పదార్థాలు కార్బో హైడ్రేట్లకు దూరంగా ఉన్నాడు. రోజుకు 21 కిలోమీటర్ల దూరం నడిచేవాడు. ఆ తర్వాత యోగా చేసేవాడు.
రోజుకు ఐదు నుంచి ఆరు గంటలు కఠినమైన కార్డియో వ్యాయామం చేసేవాడట. చెమటలు కక్కుతూ అదే పనిగా వ్యాయామం పైనే ఫోకస్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో సహజ పద్ధతుల్లో బరువు తగ్గాలని సంకల్పించాడు. బద్ధకించకుండా అనుకున్నది సాధించడానికి కఠోర శ్రమకోర్చాడు. నడకతోపాటు యోగా పవర్ అతడి సంకల్పాన్ని నెరవేర్చడానికి ఉపయోగపడింది. కొవ్వు తగ్గించి, బరువు తగ్గడానికి యోగాలో ఉన్న ఆసనాలను ఎంచుకుని మరీ వేసేవాడట. అలా రోజంతా ఇదే పనిలో ఉండేవాడు.
ఒకప్పుడూ భారీ కాయంతో ఎంత ఇబ్బంది పడ్డాడో అతడికి మాత్రమే తెలుసు. ఎక్కడికి వెళ్లినా సమస్యే. కుర్చీలో కూర్చోవాలన్నా సమస్యే. నలుగురిలో తిరగాలన్నా సమస్యే. ఇప్పుడా బాధ లేదు. స్లిమ్ గా తయారైన అనంత్ ను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమనేది అందరిలోనూ తలెత్తే ప్రశ్న. అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదనడానికి అనంత్ ఓ తాజా ఉదాహరణ. అత్యంత సంపన్నుడైన తండ్రి. బడా పారిశ్రామికవేత్తల కుటుంబం. అయినా కడుపు కట్టుకుని,జీరోషుగర్, జీరో ఫ్యాట్ తిండి తింటూ జిహ్వ చాపల్యాన్ని జయించడం మామూలు విషయం కాదు.
అనంత్ అంబానీది కూడా ఒక రకమైన విజయమే. అచీవ్ మెంట్ అనేక రకాలుగా ఉంటుంది. పర్వతం లాంటి దేహంతో అవస్థలు పడ్డ వ్యక్తి, ఆపరేషన్ లేకుండా నడక, యోగాతో 108 కిలోల బరువు తగ్గడం పెద్ద అచీవ్ మెంట్. ప్రతిదానికీ ఆపరేషన్లు మందులని పరుగులు పెట్టాల్సిన అవసరం లేదనే సంకేతాన్ని ఇస్తోంది అనంత్ విజయం. మనసుంటే మార్గం ఉంటుంది. అసాధ్యమన్నది సుసాధ్యం అవుతుంది. అనంత్ ను చూస్తే అది నిజమని రూఢి అవుతుంది.