ప్రభుత్వాలు చేస్తున్నప్రకటనలకు .. చేతలకు పొంతన ఉండటం లేదనే దానికి వాటి చర్యలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. చైనాను మించి అతి తక్కువ సమయంలో భారీ ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నామని ప్రకటనలు చేసిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నెలలు గడుస్తున్నా వాటిని అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారు. తెలంగాణలో టిమ్స్ ఆస్పత్రికి… సీఎం కేసీఆర్ ఓ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు. అది మరో నిమ్స్ అన్నారు. అక్కడ కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేశారు. కానీ రోగులకు మాత్రం చికిత్స అందించడం లేదు. దానికి కారణం ఏమిటో స్పష్టత లేదు. వైద్యుల కోసం ప్రకటనలు ఇచ్చినా ఎవరూ చేరేందుకు రావడం లేదని అప్పుడప్పుడు ప్రభుత్వం తరపున లీకులు మాత్రం వస్తూంటాయి. ఇప్పుడు తెలంగాణ తరహాలోనే ఏపీ కూడా చేరింది.
అనంతపురంలో 1500 పడకల ఆస్పత్రిని ప్రారంభించబోతున్నామని నెల రోజుల కిందట ప్రభుత్వ ముఖ్యులు ప్రకటనలు చేశారు. కోవిడ్ నియంత్రణ చర్యల గురించి సమీక్షించినప్పుడల్లా సీఎం జగన్ కూడా చెప్పేవారు. ఆ తర్వాత రాజీవ్ కృష్ణ లాంటి సలహాదారులు.. బెంగళూరులోని క్వారంటైన్ సెంటర్ల ఫోటోలు పెట్టి.. అనంతపురం ఆస్పత్రి రెడీ చేసేశామని ప్రకటించారు. ఆ తర్వాత నెటిజన్లు.. అనంతపురం ఆస్పత్రికి… బెంగళూరు ఆస్పత్రికి తేడా చెబుతూ… ఘాటుగానే సమాధానం ఇచ్చారు. దాంతో ఆయన ట్వీట్లు డిలీట్ చేయాల్సి వచ్చింది కానీ.. తాము చైనా స్థాయిలో ఆస్పత్రిని ప్రారంభించబోతున్నది మాత్రం నిజమని చెప్పుకొచ్చేవారు. ఇది జరిగి నెలన్నర అవుతోంది. అనంతపురంలో డైలీ కేసులు దాదాపుగా వెయ్యికి చేరువుగా ఉన్నాయి. కానీ ఆస్పత్రి మాత్రం ప్రారంభం కాలేదు.
అనంతలో పదిహేను వందల పడకల ఆస్పత్రికి కావాల్సిన ఏర్పాట్లను అధికారులు చేశారు. బెడ్లను ఏర్పాటు చేశారు. వైద్య మౌలిక సదుపాయాలు కూడా కల్పించడానికి పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. కరోనా వైరస్ బారిన పడ్డ వారు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతమైన వాతావరణంలో చికిత్సలు అందుకునేలా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మొత్తం 12 బ్లాక్‌లకు గాను మహిళలకు ప్రత్యేకంగా రెండు బ్లాక్‌లను కేటాయించామని… కోవిడ్ బాధితులకు సేవలు అందించే వైద్యులు, స్టాఫ్ నర్సులతో పాటు అక్కడే విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య సిబ్బంది ఉండేందుకు పురుషులు, మహిళలకు వేర్వేరుగా అన్ని వసతులతో కూడిన షెడ్లకు ఎనిమిదిన్నర కోట్లు వెచ్చించామని చెప్పారు.
ఇంత ఖర్చు చేసినా ఇంకా అక్కడ రోగులకు చికిత్స ప్రారంభించలేదు. ఎందుకో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. అంత గొప్పగా ఇతర కోవిడ్ సెంటర్ల ఫోటోలు పెట్టి పబ్లిసిటీ చేసుకున్న దాని కోసమైనా… దాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి.. అధికారులు… సలహా దారులు తమను తాము నిరూపించుంటారని అనుకుంటారు కానీ.. అలాంటి పట్టింపులేమీ లేకుండా.. తెలంగాణ టిమ్స్ తరహాలో అక్కడ వైద్యం చేస్తారో లేదో అన్నట్లుగా మార్చేశారు.