ఆంధ్రప్రదేశ్ విడిపోయిన దగ్గర నుంచీ రాయలసీమ ప్రాంత ప్రజల్లో ఒక అసంతృప్తి అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది! అదేనండీ.. రాజధాని రాయలసీమలో ఉంటే బాగుండు అనే అంశం. కొత్త రాజధాని తమ ప్రాంతానికి చాలా దూరంగా ఉందని అంటుంటారు. అమరావతి తమ రాజధాని కాదంటూ ఆ మధ్య కొంతమంది సీమ నేతలు ఉద్యమాలు లేవదీసే ప్రయత్నాలు కూడా చేశారు. అప్పట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీమపై కాస్త శ్రద్ధ చూపించడంతో ఈ వాదన నెమ్మదిగా పక్కకు వెళ్లినట్టయింది. గతంలో ఇలాంటి అనుభవం ఉంచుకుని కూడా… రాయలసీమకు సంబంధించి ఒక కీలక హైవే ప్రాజెక్టు విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేతులు ఎత్తేయడం విశేషం!
అనంతపురం నుంచి అమరావతి వరకూ ఎక్స్ ప్రెస్ వే నిర్మిస్తామని అప్పట్లో సీఎం చెప్పారు. రాయలసీమ వాసులు నవ్యాంధ్ర రాజధానికి రావాలంటే కష్టంగా ఉందనీ, అందుకే ఆరు లైన్లలో అత్యాధునిక సదుపాయాల ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. త్వరలోనే భూసేకరణ మొదలుపెడతామని కూడా సీఎం చెప్పారు. అంతేకాదు, కేంద్ర ఉపరితల రవాణా శాఖ నుంచి కూడా ఈ భారీ ప్రాజెక్టు విషయమై అనుమతులు తెచ్చుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికలు సిద్ధమైపోయాయి. చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఒక ప్రముఖ కంపెనీ కూడా రంగంలోకి దిగి, తామే ప్రాజెక్టు నిర్మించబోతున్నట్టుగా అధికారులకు చెప్పేసింది! ఈ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టు పూర్తయితే దారి పొడవునా భూములకు మాంచి ధరలు వస్తాయన్న ఆశతో పలువురు అధికార పార్టీ నేతలు భారీ ఎత్తున భూముల్ని కొనుగోలు చేసేశారనే కథనాలు చక్కర్లు కొట్టాయి.
ఇన్ని జరిగిన తరువాత… ఇప్పుడు కేంద్రంతో ఈ ప్రాజెక్టు విషయమై చంద్రబాబు కొత్త మెలిక పెట్టారట! భూసేకరణ ఖర్చులను మీరే భరించాలంటూ కేంద్రాన్ని చంద్రబాబు కోరినట్టు తెలుస్తోంది. దీనికి కేంద్రం నో చెప్పిందని సమాచారం. నిజానికి, భూసేకరణ వ్యయాన్ని రాష్ట్రం భరిస్తుందని గతంలో ముఖ్యమంత్రే అన్నారు. కానీ, ఇప్పుడు ఆ ఖర్చును కేంద్రం ఖాతాలో వేసి మాట మార్చేశారు. దీంతో కేంద్రం అవాక్కయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భూసేకరణ వ్యయాన్ని కేంద్రం భరిస్తుందని అనడంతోనే ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమయ్యామని ఇప్పుడు చంద్రబాబు చెప్తుండటం విశేషం. అంతా సిద్ధం అనుకున్నాక ఇప్పుడు ఇలా మాట మార్చడమేంటీ అంటూ కేంద్రాన్ని చంద్రబాబు ప్రశ్నిస్తూ ఉండటం విడ్డూరంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వెరసి, ఆర్ అండ్ బి శాఖ అధికార వర్గాల్లో వ్యక్తమౌతున్న అభిప్రాయం ఏంటంటే… ప్రతిష్ఠాత్మకమైన అనంతపురం – అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టు అటకెక్కిందని!