జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అనంతపురంలో భీకర ప్రతిజ్ఞ చేశారు… అదేమిటంటే..” ప్రభుత్వాన్ని కూల్చకపోతే.. తన పేరు పవన్ కాదని..”…!. పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద.. చంద్రబాబు మీద.. అందరి కంటే ఎక్కువగా లోకేష్‌పై కోపం ఉండవచ్చు గాక. అంత మాత్రం దానికే ప్రభుత్వాన్ని కూలదోస్తాను.. అలా చేయకపోతే.. పేరు మార్చుకుంటాననే సవాళ్లు చేయడం అచ్చంగా… రాజకీయ నటనే. ఆ నటనను… ఎదురుగా ఉన్న ఫ్యాన్స్ .. చప్పట్లు కొడతారేమో కానీ.. మిగతా పబ్లిక్ మాత్రం.. కిసుక్కున నవ్వుకుంటుంది.
కూలదోయాలంటే ఎమ్మెల్యేలు కావాలని తెలియదా..?
కొన్నాళ్ల క్రితం.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాజ్‌భవన్‌కు వెళ్లారు.గవర్నర్‌కు చేయాల్సిన ఫిర్యాదులేవో చేసి.. ఇరవై మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ప్రభుత్వాన్ని కూలదోస్తామని ప్రకటించారు. కట్ చేస్తే.. ఇరవై మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చారు. ప్రభుత్వాన్ని కూలదోసింది లేదు కానీ.. తమ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసిందని గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అవిశ్వాస తీర్మానం పెట్టే ధైర్యం కూడా లేకపోయింది. ఇప్పుడు ఆ బాధ్యత పవన్ కల్యాణ్ తీసుకున్నారు. ప్రభుత్వాన్ని కూలదోస్తానని వీరావేశ ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కూలదోయాలంటే.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉండాలి.. వారితో అవిశ్వాస తీర్మానం పెట్టించాలి.. మెజార్టీ ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ చేయించాలి. కానీ పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కూలదోయడం అంటే.. సినిమాల్లో.. ధర్మాకోల్ షీట్లతో తయారు చేసే గోడల్ని ఒక్కదెబ్బతో పడగొట్టినట్లు. పడగొట్టడం అనుకుంటున్నట్లు ఉన్నారు.
ఎన్నికల్లో ఓడిస్తానని చెప్పేందుకు తిప్పలా..?
అసలు ఎమ్మెల్యేలే లేరు కాబట్టి.. పవన్ కల్యాణ్.. ఎలా … ప్రభుత్వాన్ని కూలదోస్తారని.. ప్రశ్నిస్తే.. రంధ్రాన్వేషణ చేస్తున్నారని… ఆయన ఫ్యాన్స్ చెప్పుకునే చాన్స్ కూడా ఉంది. మనసులో భావాన్ని పక్కాగా వ్యక్తీకరించలేని వాళ్లు.. ఒకటి చెప్పి.. దానర్థం స్పష్టంగా ఉన్నా.. తన ఉద్దేశం అది కాదని చెప్పుకునే వాళ్లు నేతలు ఎలా అవుతారు..? అలా అనుకున్నా.. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడిస్తానని.. చేసిన భీకర ప్రతిజ్ఞ అది కావొచ్చు. కూలదోయడానికి.. ఓడించడానికి మధ్య తేడా తెలియదని అనుకుందాం..! మాటలతోనే.. ప్రభుత్వాన్ని కూలదోస్తారా.. అదే ఎన్నికల్లో ఓడిస్తారా..?. పోరాటయాత్రల పేరుతో.. ఊళ్లు తిరిగితే.. ఆవేశ పడితే… ఓడించేస్తారా..?
అసలు పవన్ లక్ష్యం ఏమిటి…? అధికారమా..? టీడీపీ ఓటమా..?
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరికి మొదటి లక్ష్యం.. తను అధికారంలోకి రావడం. అంతే కానీ… వేరే పార్టీని అధికారంలోకి రానీయకుండా చేయడం కాకూడదు. తాను అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు.. ఫలానా వాళ్లు అధికారంలోకి రాకుండా చేస్తానని ప్రగల్బాలు పలకడం అమాయకత్వం. రాజకీయాల్లో పక్క పార్టీని ఓడించడానికి పార్టీలు నడిపేవాళ్లు బహుశా పవన్ కల్యాణ్‌లా ఉంటారేమో..? . టీడీపీని రానీయను.. ప్రభుత్వాన్ని కూలదోస్తా.. మీసం తీసేస్తా… గుండు కొట్టించుకుంటా.. పేరు మార్చుకుంటా లాంటి ప్రకటనలు చేస్తే ప్రజలు నమ్మలేరు. సిన్సియర్‌గా రాజకీయం చేయాలి. ప్రజల కోసమే రాజకీయం చేస్తున్నట్లు కనీసం నటించాలి. అది కూడా చేత కాకుండా.. నేను పోటుగాడ్ని అని అందర్నీ బెదిరించుకుంటూ పోతే… చివరికి మిగిలేది ఏదీ ఉండదు..!
నిలువెల్లా వ్యక్తిగత ద్వేషమే..! ఎక్కడైనా రాజకీయం కనిపిస్తోందా..?
పవన్ కల్యాణ్ రాజకీయాన్ని ఓ సారి నింపాదిగా చూస్తే.. ఆయన చేస్తుంది రాజకీయం కాదని సులువుగా అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలపై వ్యక్తిగత ద్వేషంతో ఆయన రగిలిపోతూ ఉంటారు. ఆ ద్వేషాన్ని తన మాటలతో వెల్లడిస్తూ ఉంటారు. తాను ఏమైనా చేయగలనని బెదిరించడానికే తాపత్రయ పడుతూంటారు. తన బెదిరింపులకు ఎవరూ భయపడలేదనుకున్నప్పుడు… వ్యక్తిగత దూషణలకూ వెళ్లిపోయి.. తనను తాను సంతృప్తి పరుచుకుంటూ ఉంటారు. చంద్రబాబు వయసు మీద.. చేసే కామెంట్లు ఇలాంటివే. తాను ఎన్నో పుస్తకాలు చదివానని… ఎంతో జ్ఞానం మూటగట్టుకుని చెప్పుకుంటూ.. ఎప్పటికప్పుడు అజ్ఞనాన్ని బయటపెట్టుకుంటూ ఉండటమే రాజకీయ అనుకుంటున్నారు.
—- సుభాష్