ఏపీ పోలీసులు ఎవరూ చూడటం లేదని అనుకుంటున్నారో.. ఏవరేమనుకుంటే పోయేదేమిటనుకుంటున్నారో కానీ.. అసలు తగ్గట్లేదు. తాజాగా భానుప్రకాష్ అనే కానిస్టేబుల్‌ను డిస్మిస్ చేయడానికి చూపించిన కారణం అంతా ఫ్రాడ్ అని తేలిపోయింది. తనను బూచిగా చూపించి భానుప్రకాష్‌ను బలిపశువును చేశారని.. తప్పుడు వాంగ్మూలాన్ని పోలీసులే క్రియేట్ చేశారని దానిపై తాను ఎప్పుడో ఫిర్యాదు చేశానని కూడా మహిళ మీడియా ముందుకు వచ్చి చెప్పడం చర్చనీయాంశమయింది. ఎవరి ఫిర్యాదుపై అంతర్గత విచారణ జరిపి నిజమని తేల్చారో ఆ మహిళే పోలీసుల కుట్రని చెబుతున్నారు. దీంతో అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పకు మింగా కక్కలేని పరిస్థితి ఏర్పడింది.
ఇంతకు ముందు ఆయన ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో చెప్పిన కథలు … చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు సొంత డిపార్టుమెంట్ కానిస్టేబుల్‌ను డిస్మిస్ చేయడానికి చెప్పిన కథ కూడా అలాంటిదేనని తేలింది. ఈ విషయంలో తదుపరి చర్యలు ఎలా ఉంటాయో కానీ..ప్రజల్లో మాత్రం పోలీసులు రోజు రోజుకు చులకన అయిపోతున్నారు. సొంత కానిస్టేబుల్‌ను దారుణంగా హత్య చేస్తే నిందితుల్ని పట్టకోలేకపోయారు. ఇప్పుడు తమ కోసం పోరాడిన మరో కానిస్టేబుల్ ను డిస్మిస్ చేశారు. రాజకీయ బాసుల కోసం తాను పని చేస్తున్న వ్యవస్థను కూడా నాశనం చేసుకుంటున్న వైనం ఇప్పుడు బయటపడుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇవన్నీ తప్పుడు కేసులు.. ఫిర్యాదులు. ఈ సారి నిజాయితీగా విచారణ జరిపే ప్రభుత్వం వస్తే.. ఇలాంటి తప్పుడు ఫిర్యాదులతో చర్యలు తీసుకున్న వారు కూడా ఇబ్బంది పడతారు. అప్పుడు కూడా నష్టపోయేది పోలీసు శాఖ. ఇప్పుడు వీరు చేస్తున్న పనుల వల్ల.. భవిష్యత్‌లోనూ పోలీసు శాఖ తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. పోలీసు వ్యవస్త ఉన్నతాన్ని కాపాడాల్సిన పెద్దలే లైట్ తీసుకుంటే… ఇతరులు మాత్రం ఏం చేస్తారు ?