ఊరంత చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి.. అని ఓ తెలుగు సినిమాలో పాటని తూ.చ తప్పకుండా పాటిస్తూ అంబానీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఊరంతా కాదు.. ప్రపంచం అంతా చర్చించుకునేలా ఈ పెళ్లి చేస్తున్నారు. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబాని – రాధిక మర్చంట్ పెళ్లి ముంబైలోనే అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పెళ్లి విశేషాల గురించి చెప్పుకోవాలంటే… ఓ న్యూస్ చానల్ కు ఇరవై నాలుగు గంటలూ సరిపోవు.
చాలా మంది సామాన్యులు పెళ్లి వార్తలు, విశేషాలు చూస్తూ.ఏంటీ ఇంకా పెళ్లి అయిపోలేదా అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ వివాహానికి ముందు పెళ్లిని మించి సంబరాలు చేశారు. ప్రపంచ ప్రముఖుల్ని ఆహ్వానించి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇవి ఎన్ని సార్లు జరిగాయో చెప్పడం కష్టం. జరిగిన ప్రతీ సారి ఓహో ఈ సారి పెళ్లి అయిపోయి ఉంటుందని అనుకున్నారు జనం. కానీ అసలైన పెళ్లి మాత్రం ఇవాళే.
పెళ్లి కూడా ఒక్క రోజు కాదు. మూడు రోజులు. వరుడు సినిమాలో ఐదు రోజుల పెళ్లిని చూపించారు. కానీ అంబానీల దగ్గర టైం లేదమో కానీ.. మూడు రోజులే చేసుకుంటున్నారు. ఇవాళ పెళ్లి జులై 13న శుభప్రదమైన ఆశీర్వాదం, 14న వివాహ రిసెప్షన్ ఉంటుంది. తర్వాత రోజు మంగళ ఉత్సవ్ నిర్వహించి.. వేడుకలు ముగిస్తారు. ఆ తర్వాత వేరే పార్టీలు ఉంటాయేమో కానీ అప్పటికి పెళ్లయిపోతుంది. ఈ పెళ్లి వార్తలతో జాతీయ మీడియా అంతా… తమ ఇంట్లో పెళ్లన్నంతగా హడావుడిపడిపోతోంది.