టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంటును అనంతపురం కోర్టు మంగళవారం వెనక్కి తీసుకొంది. బిజినెస్ ఇండియా మ్యాగజిన్ కవర్ పేజీపై విష్ణుమూర్తి అవతారంలో ధోనీ బూట్లు, కూల్ డ్రింక్ బాటిల్, దుస్తులు వగైరా పట్టుకొని ఉన్న చిత్రం ప్రచురించబడినందుకు అతనిపై బెంగళూరు మరియు అనంతపురం కోర్టులలో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి.
ధోనీ తరపున లాయర్లు బెంగళూరు కోర్టులో కేసుకు హాజరయ్యారు కానీ అనంతపురం కోర్టుకి ధోనీ తరపున ఎవరూ హాజరు అవలేదు. కోర్టు పంపిన నోటీసులు కూడా తీసుకోలేదు. రెండు మూడు సార్లు నోటీసులు పంపినా వాటికి ధోనీ తరపున ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఆగ్రహించిన అనంతపురం కోర్టు అతనిని అరెస్ట్ చేసేందుకు జనవరి 7న నాన్ బెయిలబుల్ వారెంటును జారీ చేసింది.
ఈ విషయం తెలిసిన ధోనీ న్యాయవాదులు రజనీష్ చోప్రా మరియు పంకజ్ బాగ్ల అనంతపురం కోర్టులో ఇవ్వాళ్ళ ధోనీ తరపున హాజరయ్యి, ధోనీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మ్యాచ్ ఆడేందుకు వెళ్లినందున కోర్టు పంపిన అరెస్ట్ వారెంట్ ను అందుకోలేకపోయారని, కనుక వారెంటును ఉపసంహరించుకోవలసిందిగా అభ్యర్ధించారు. కోర్టు వారి అభ్యర్ధనను మన్నించి ఫిబ్రవరి 25న ధోనీ స్వయంగా కోర్టు ముందు హాజరు కావలసిందిగా ఆదేశించి, అతనిపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంటును ఉపసంహరించుకొంది.