సెలబ్రెటీలు బయట కనిపిస్తే.. ఫొటోలు, సెల్ఫీలూ మామూలే. సెలబ్రెటీలకు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం అనుకోవాలి. అదో హోదాగా స్వీకరించాలి. ఇంత మంది అభిమానం సంపాదించినందుకు గర్వపడాలి. అయితే అప్పుడప్పుడూ ఇలాంటి వ్యవహారాలన్నీ తలనొప్పి తీసుకొస్తుంటాయి. ఎదుటివాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోకుండా ఫొటో ప్లీజ్ అంటూ వెంటపడుతుంటారు. ఇలాంటప్పుడే కాస్త శాంతం పాటించాలి. లేదంటే రివర్స్‌లో మనకే కొత్త తలనొప్పులు వస్తుంటాయి. అనసూయ విషయంలో ఇదే జరిగింది. సోమవారం తార్నాకలో ఓ చిన్న పిల్లాడిపై అనసూయ దౌర్జన్యం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి విజయపూరి కాలనీలో అనసూయ కనిపించగానే ఓ చిన్న కుర్రాడు సెల్‌ఫోన్ పట్టుకుని ఫోటో కోసం పరుగులు పెట్టాడు. అయితే అప్పటికే అసహనంతో ఉన్న అనసూయ.. ఆ కుర్రాడి సెల్‌ఫోన్ లాక్కుని నేలనేసి కొట్టిందట. అంతే కాదు దుర్భాషలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయిందట. దాంతో కుర్రాడి తల్లి… ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అనసూయపై తార్నాక పోలీస్ స్టేషన్లో ఓ ఫిర్యాదు నమోదయ్యింది. దీనిపై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.