రంగమ్మత్త.. అనసూయ అటు బుల్లి తెరపై, ఇటు వెండి తెరపై రెండు చోట్లా బిజీనే. వీలున్నప్పుడు, తనకు తగిన పాత్రలొచ్చినప్పుడు వెండి తెరపై విజృంభిస్తూ – పనిలో పనిగా బుల్లితెరనీ ఏలేస్తూ..రెండు చేతులా సంపాదిస్తోంది. ఇప్పుడు… `ఖిలాడీ`తోనూ ఆడిపాడడానికి రెడీ అవుతోంది. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా `ఖిలాడీ`. రమేష్ వర్మ దర్శకుడు. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో అనసూయని ఎంపిక చేసుకున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మామూలులా అయితే… అనసూయని ప్రత్యేక గీతం కోసం ఎంచుకుంటారు. అయితే ఇందులో కథని మలుపు తిప్పే పాత్రలో అనసూయ కనిపించబోతోందట. `షి కెన్ బీ గేమ్ ఛేంజర్` అంటూ ఆ పాత్రకు సంబంధించిన హింట్ కూడా ఇచ్చేసింది చిత్రబృందం. దాంతో పాటు ఐటెమ్ గీతం కూడా అదనం. ఈరోజు నుంచే… అనసూయ `ఖిలడీ` సెట్లోకి అడుగుపెట్టబోతోందని సమాచారం. ఇటీవల ఓ ఐటెమ్ పాట కోసం అనసూయని సంప్రదిస్తే.. ఏకంగా 20 లక్షలు డిమాండ్ చేసిందట. మరి ఇప్పుడెంత తీసుకుంటుందో?