ఎంత ఎదిగామన్నది కాదు, ఎక్కడ మొదలయ్యామన్న విషయం గుర్తుండాలి. మొదలును మర్చిపోనివ్యక్తికి గొప్ప వ్యక్తిత్వం ఉన్నట్టే. జీవితంలో ఎదుగుతున్న క్రమంలో మనకు సాయం చేసిన వారి రుణం తీర్చుకునే అవకాశం అంత తేలిగ్గా చాలా మందికి దొరక్కపోవచ్చు. అనసూయకు ఆ అవకాశం దొరికింది. ఎందుకంటే ఆమె కెరీర్ తొలినాళ్లలో `సాక్షి`లో యాంకర్‌గా పనిచేసింది. అక్కడి నుంచే ఆమె సినిమా వేడుకలను వ్యాఖ్యాతగా బయటకు రావడం మొదలుపెట్టింది. అటు నుంచి టీవీ, సినిమాల్లోకి ఎదిగింది. ఇదంతా ఎందుకంటే శుక్రవారం విడుదలైన `యాత్ర` సినిమాకు, అనసూయ తొలి నాళ్లకూ లింకు ఉంది. యాత్ర సినిమాలో అనసూయ రామిరెడ్డి కూతురు కేరక్టర్లో నటించింది. తొలి సన్నివేశంలోనే ఆమె కనిపిస్తుంది. వై.యస్.ఆర్ ఆమెకు నామినేషన్ వేయించి, గెలిపించడానికి అభయం ఇవ్వడం, పక్కనే ఉండి నామినేషన్ వేయించడం వంటివన్నీ సినిమా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే సన్నివేశాలు. `గడపదొక్కి సాయమడిగిన ఆడకూతురితో రాజకీయాలేంది` అని మమ్ముట్టి చెప్పే డైలాగుకు చప్పట్లు పడ్డాయి. వై.యస్.ఆర్. వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాల్లో అనసూయ చాలా చక్కగా నటించింది. `సాక్షి`లో పనిచేసే రోజుల్లో ఆమెకు వై.యస్.ఆర్.ను కలిసే అవకాశం వచ్చిందో రాలేదో కానీ, ఈ సినిమాలో మాత్రం చాలా మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఒక రకంగా వై.యస్.ఆర్ సొమ్ము తిన్నందుకు రుణం తీర్చుకున్నట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.