కోట శ్రీనివాసరావు ఖాళీగా ఉంటున్నారు.. వయసు మీద పడిన చాదస్తం కూడా ఉందేమో కానీ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖాళీగా ఉంటూ యూట్యూబ్ చానళ్లకు ఇంటర్యూలు ఇస్తున్నారు. ఆ ఇంటర్యూల్లో సందర్భం లేని వారిపై కామెంట్లు చేస్తున్నారు. దానికి రివర్స్‌లో ఆయన పెద్దరికం కూడా చూడకుండా ఇతరులు కౌంటర్లు ఇస్తున్నారు. మా ఎన్నికల సందర్భంగా .. మంచు ప్యానల్‌కు మద్దతుగా ఆయన బయటకు వచ్చి ప్రకాష్ రాజ్ ప్యానల్‌పై విమర్శలు చేయడం.. దానికి నాగబాబు ఇచ్చిన కౌంటర్ కూడా వివాదాస్పమయింది. తాజాగా కోట శ్రీనివాసరావు .. నటి అనసూయ డ్రెస్సింగ్ మీద కామెంట్ చేశారు.
అనసూయ అందమైన నటి అని ఎలా ఉన్నా చూస్తారని కానీ ఆమె అలా డ్రెస్ చేసుకోవడం బాగో లేదన్నారు. ఇప్పటికే తన గురించి .. తన అలవాట్లు.. తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడేవారికి ఘాటుగా సమాధానాలిచ్చిన రికార్డు ఉన్న అనసూయ వెంటనే స్పందించారు. కోట సీనియర్ యాక్టర్ అయినా తన గౌరవాన్ని కాపాడుకోవాలన్నట్లుగా సోషల్ మీడియాలో ఘాటు పోస్ట్ పెట్టారు. కోట పేరును నేరుగా చెప్పకుండా ఓ సీనియర్ యాక్టర్ తన డ్రెసింగ్ గురించి చేసిన కామెంట్స్ గురించి విన్నానని.. అనుభవం గల వ్యక్తి ఇలాంటి ఛీప్ కామెంట్స్ చేయడం దౌర్భాగ్యమని మండిపడింది.
ఒకరి డ్రెసింగ్ అనేది పూర్తిగా పర్సనల్ అని, ప్రొఫెషనల్ చాయిస్ కూడా కావచ్చని అనసూయ తెలిపింది. ఇంతకుముందు సోషల్ మీడియా ఎప్పుడైనా ఆ సీనియర్ యాక్టర్ మందు వేయడం, చిరిగిన దుస్తులు ధరించడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం గురించి చర్చించిందా? అని ప్రశ్నించింది. పెళ్లి చేసుకుని పిల్లలున్న స్టార్ హీరోలు హీరోయిన్లతో రొమాన్స్ చేయడం, షర్ట్ విప్పేసి ఎక్స్పోజ్ చేయడం గురించి మాట్లాడని వారు.. తనలాంటి పెళ్లై, పిల్లలున్న మహిళలు కెరియర్లో సక్సెస్ కావాలని ముందుకెళ్తే మాత్రం విమర్శలకు దిగుతున్నారని క్లాస్ తీసుకుంది. మొత్తానికి కోట మరోసారి వార్తల్లోకి వచ్చేశారు.