బిగ్ బాస్ 3 సీజన్లో అనసూయ కూడా కనిపించబోతోందన్న వార్త గట్టిగా చక్కర్లు కొట్టింది. అనసూయ, రష్మిలాంటి గ్లామర్ భామలు బిగ్ బాస్‌లో ఉంటే, ఈ షోకి ఓ కొత్త కళ వస్తుందనుకున్నారు. కానీ ఇద్దరూ ఈ షోకి దూరమయ్యారు. అనసూయ దగ్గరకు బిగ్ బాస్ ప్రతిపాదన వెళ్లింది. భారీ మొత్తంలో పారితోషికం కూడా ఇస్తానమన్నారు. కానీ… అనసూయ ఒప్పుకోలేదు. అందుకు గల కారణం కూడా ఇలా చెప్పుకొచ్చింది.
“బిగ్ బాస్ షో కోసం నన్ను సంప్రదించారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఇంటినీ, పిల్లల్నీ వదిలి నేనేం చేయలేను. ఒక్కరోజు పిల్లల్ని చూడకపోయినా.. బెంగ వచ్చేస్తుంది. సెట్లోంచే వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటా. వాళ్లని అన్ని రోజులు మిస్ అవ్వడం అంటే చాలా కష్టం. అందుకే బిగ్ బాస్ షోకి దూరమయ్యా” అంటోంది. తను కథానాయికగా నటించిన ‘కథనం’ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సినిమాపై అనసూయ చాలా ఆశలు పెట్టుకుంది. “క్షణం తరవాత చాలా కథలు విన్నా. కానీ ఏవీ సంతృప్తి ఇవ్వలేదు. కథనం మాత్రం బాగా నచ్చింది. ఓ సినిమాలో కథానాయికగా చేసి, ఆ సినిమా బాధ్యతంతా మోయడం చాలా కష్టం. విడుదలకు ముందు రోజు నాకు నిద్రపట్టదని హీరోలు, హీరోయిన్లూ చెబుతూ ఉంటారు. కానీ నేను నమ్మేదాన్ని కాదు. ఇప్పుడు ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో అర్థమవుతోంది. నాకూ ఈమధ్య నిద్రపట్టడం లేదు” అంటోంది అనసూయ.