ఇప్పుడు సినిమా బంతి అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఓటీటీల దగ్గరే ఆగింది. థియేటర్లు లేవు. తెరచినా సినిమాల్ని విడుదల చేసే ధైర్యం నిర్మాతలకు లేదు. అందుకే.. ఓటీటీల వైపు చూస్తున్నారంతా. మరీ ముఖ్యంగా చిన్న, మీడియం సైజు సినిమాల్ని లాగేయడానికి ఓటీటీలు ఉత్సాహం చూపిస్తున్నాయి. అందులో భాగంగా `థ్యాంక్యూ బ్రదర్` ఓటీటీలో విడుదల కానుంది. అనసూయ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది. చిత్రీకరణ ఎప్పుడో పూర్తయ్యింది. థియేటరికల్ రిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లూ చేసుకున్న తరవాత… కరోనా సెకండ్ వేవ్ ఉధృతమైంది. ఈ నేపథ్యంలో.. ఈ సినిమాని `ఆహా`లో విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. మే 7న ఈ సినిమా `ఆహా`లో విడుదల కాబోతోంది. ఈ రోజు నుంచి ప్రమోషన్లు కూడా మొదలెట్టారు. అనసూయ అనగానే గ్లామర్ పాత్రలు, పాటలూ ఆశిస్తారు. కానీ ఇది అలాంటి సినిమా కాదు. ఇందులో అనసూయ గర్భవతిగా కనిపించబోతోంది. ఎమోషన్స్, థ్రిల్.. ఇవన్నీ కలగలిపిన సినిమా ఇది. అందుకే కొత్త తరహా అనసూయని చూసే అవకాశం ఈ సినిమా కల్పిస్తోందని చిత్రబృందం చెబుతోంది.