ప్రదీప్ మాచిరాజు. టాలీవుడ్ లో నెంబర్ వన్ మేల్ యాంకర్. ఒక్కో ఎపిసోడ్కీ కనీసం 50 వేలైనా సంపాదిస్తాడు. అలాంటి యాంకర్ సినిమా చేస్తున్నాడంటే, పారితోషికం గట్టిగానే డిమాండ్ చేస్తాడని ఫిక్సయిపోవొచ్చు. అయితే తన తొలి సినిమాకి పారితోషికం పైసాకూడా తీసుకోలేదు.
అవును.. ప్రదీప్ మాచిరాజు హీరోగా `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. రేపే విడుదల. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకూ పారితోషికం తీసుకోలేదట. ప్రదీప్ తొలి సినిమా ఇది. అందుకే ఈ సినిమా బాగా రావాలని తపన పడ్డాడు. తన పారితోషికం డబ్బుల్ని మంచి టెక్నీషియన్స్ ని తీసుకోవడంలో వాడమని నిర్మాతలకు సలహా ఇచ్చాడట. అందుకే ఈ సినిమాకి మంచి టెక్నీషియన్లు కుదిరారు. బడ్జెట్ కూడా ఎక్కువగానే అయ్యింది. “ఈ సినిమా కోసం పారితోషికం తీసుకోలేదు. సినిమా విడుదలై, నిర్మాతలు సేఫ్ అయిపోయి, లాభాలొస్తే.. అప్పుడు తీసుకుంటా“ అని చెప్పుకొచ్చాడు ప్రదీప్. `నీలీ నీలీ ఆకాశం ఇద్దామనుకున్నా` లాంటి సూపర్ హిట్ గీతంతో… ఈ సినిమా ఎప్పుడో జనాల్లోకి వెళ్లిపోయింది. పైగా యాంకర్ గా తెలిసిన ఫేసే. సినిమా బాగుండి, మంచి టాక్ వస్తే… ప్రదీప్ కి పారితోషికం తిరిగి వచ్చేసినట్టే.