తమన్ నిర్మాతల మ్యూజిక్ డైరెక్టర్. నిర్మాత కష్టం వింటాడు. తనకు ‘ఇంతే కావాలి’ అని గిరిగీసుకొని కూర్చోడు. సినిమా పరిధిని బట్టే తీసుకుంటాడు. వేగం కూడా ఎక్కవే. ఎంత తక్కువ సమయం వున్నా చెప్పిన సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేసి నిర్మాత చేతిలో పెడతాడు. మరీ సూపర్ హిట్లు, సంవత్సారాలు పాటు దాచుకునే పాటలు వుండకపోయినా, సినిమా థియేటర్ లో ఉన్నంతకాలం తనదైన సౌండ్ తో మోత మోగిస్తుంటాడు. అందుకే నిర్మాతలకు తమన్ గుడ్ ఛాయిస్ గా మారాడు. తమన్ లోని ఈ లక్షణాలే అత్యంత వేగంగా వంద సినిమాలు వైపు పురుగులు పెట్టుస్తున్నాయి.
అయితే తమన్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఓ ట్రెండ్ తీసుకొచ్చాడు. అదే.. సింగర్ల రియల్ వాయిస్ ని సింథసైజర్స్ లో పెట్టి నలిపేయడం. అంతకుముందు అక్కడక్కడ ఈ తరహా ట్రెండ్ వినిపిస్తున్నా తమన్ వచ్చిన తర్వాత ఇది కాస్త ఎక్కువైయింది. బాగా పరిశీలించి వింటే తప్పితే ఎవరు పాడుతున్నారు ? ఏం పాడుతున్నారు? అన్న సంగతి అర్ధం కాదు. లిరిక్స్ గాల్లో కలిసిపొతుంటాయి. సింగర్స్ ఎవరో కూడా అర్ధం కాదు. ట్రాక్ లిస్టు పట్టుకుంటే తప్పా ఈ పాట పాడింది ఫలానా సింగర్ అని చెప్పలేం.
ఇప్పుడు అలాంటి పాటే మరొకటి వచ్చింది. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా విన్నర్. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇందులో యాంకర్ సుమ ఓ పాట పాడింది. కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. సుమ ఎలా పాడిందో విందాం అనుకుంటే.. కాసేపు ఏం అర్ధం కాలేదు. ఆ కొద్దిసేపటికి ‘సుయ సుయ అనసూయ’ అనే మాట వినిపించింది. తర్వాత ఏదో ఆడ గొంతు. సుమ అని ముందు చెప్పారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ వాయిస్ ఎవరితో తెలుసుకోవడం కష్టమే. అలా నలిపేశాడు సుమ వాయిస్ ని. అయితే పాట మాత్రం క్యాచిగా వుంది. అనసూయ అందాలు , తేజు డ్యాన్స్ లతో థియేటర్ లో మోతమోగడం ఖాయమని చెప్పొచ్చు.