ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్యకు గురయ్యే ముందు.. చివరి సారిగా ఓ రాజకీయ నాయకుడ్ని కలిసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జనవరి 30న జూబ్లిహిల్స్ లోని హోటల్ దసపల్లాలో… చిగురుపాటి జయరామ్.. ఎక్కువ సమయం గడిపారు. అక్కడ ఎక్స్ప్రెస్ టీవీ గురించిన చర్చలను కొందరు వ్యక్తులతో జరిపినట్లు చెబుతున్నారు. దసపల్లా హోటల్ లో ఓ మహిళా యాంకర్ పేరుతో.. రూమ్ బుక్ చేశారు. దాదాపుగా వారం రోజుల పాటు .. మహిళా యాంకర్ పేరు మీదనే ఉందని చెబుతున్నారు. ఆ రూమ్ లోనే కొంత మందితో జయరాం చర్చలు జరిపారని అనుమానిస్తున్నారు. ఆ రూమ్ మిస్టరీ ఏమిటో తేలితే.. కేసు తేలిపోతుందని పోలీసులు భావిస్తున్నారు. జయరాంను హత్య చేసిన వ్యక్తులు హైదరాబాద్ కు చెందిన వారేనని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ప్రాధమికంగా జయరాం మేనకోడలు శిఖా చౌదరినే ఈ కేసులో ప్రధాన అనుమానితురాలని పోలీసులు ఓ అంచనాకు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
జయరాం జూబ్లిహిల్స్ లోని తన ఇంటి నుంచి జనవరి 30వతేది మధ్యాహ్నం ఒంటరిగా వెళ్లారు. నేరుగా దసపల్లా హోటల్ కు వెళ్లారు. అదే రోజు రాత్రి విజయవాడకు బయలుదేరారు. ఈ మధ్యలో.. దసపల్లా హోటల్ కు తన సన్నిహితుడైన ఒక వ్యక్తికి ఫోన్ చేసి డబ్బు తెప్పించుకున్నారని పోలీసులు గుర్తించారు..ఆ వ్యక్తి ఆరులక్షల రూపాయలు తీసుకుని వచ్చి జయరాంకు అప్పగించారు. హఠాత్తుగా జయరాం ఆరు లక్షల రూపాయలను ఎందుకు తెప్పించుకున్నారు? ఆ డబ్బు ఎవరికి ఇచ్చారు? అన్న విషయాలు తెలుసుకోవడం కోసం పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయి.
జయరాంతో విభేదాలున్నాయని ప్రచారం జరుగుతున్న మేనకోడలు శిఖా చౌదరినే పోలీసులు ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆర్ధిక వ్యవహరాలకు సంబంధించి అకౌంటెంట్ వేణు ను కూడా పోలీసులు ప్రశ్నించారు .శిఖా నోరు విప్పితే చాలా విషయాల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. జయరాం.. చివరి సారిగా.. విజయసాయిరెడ్డిని కలిసినట్లుగా తేలడంతో.. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.