బుల్లి తెర యాంకర్లు అప్పుడప్పుడూ వెండి తెరపై సందడి చేయడం చూస్తూనే ఉంటాం. ఝాన్సీ అయితే యాంకరింగ్ వదిలేసి నటిగా బిజీ అయిపోయింది. సుమ ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. అనసూయ సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఉదయ భాను ముందు నుంచీ వెండి తెరపై ఫోకస్ చేస్తూనే ఉంది. కానీ సరైన పాత్ర పడలేదు. ఒకట్రెండు సినిమాల్లో ఐటెమ్ గీతాలు కూడా చేసింది. హీరోయిన్ గా ప్రయత్నించింది. ఇప్పుడు ఏకంగా విలనిజం పలికించడానికి రెడీ అయిపోయింది. సత్యరాజ్ ప్రధాన పాత్రలో ‘బార్బరిక్’ అనే సినిమా తయారైంది. మోహన్ శ్రీవత్స దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో మారుతి ఓ కీలకమైన భాగస్వామి.
ఇందులో ఉదయభాను విలనిజం చూపించబోతోందట. ఉదయ్ భాను పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని, ఈ సినిమాతో తన ఇమేజ్ పూర్తిగా మారబోతోందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 3న టీజర్ వదలబోతున్నారు. ఈ టీజర్ చూశాక ఉదయభాను పాత్రపై ఓ స్పష్టత రావొచ్చు. ఇటీవల విజయ్ సేతుపతి ‘మహారాజా’ విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. ఈ కథ కూడా ‘మహారాజా’ జోనర్లోనే సాగుతుందని, ట్విస్టులు, స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. `బార్బరిక్` ఉదయభాను కెరీర్ని ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలి.