తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5
ఈ రోజుల్లో కథ ఎలా ఉన్నా ఫర్వాలేదు, కథని నడిపించిన విధానం మాత్రం కొత్తగా ఉంటే చాలు అనుకొంటున్నారు. అయితే రొటీన్ కథ తీసుకోవడం వల్ల, ఎంత కష్టపడినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా… లాభం ఉండడం లేదు. అదే కసరత్తు కథ విషయంలో చేస్తే.. బాగుంటుంది కదా అనిపిస్తుంటుంది. కథ కొంచెం కొత్తగా ఉన్నా, కథనాన్ని పరుగులు పెట్టించొచ్చు. ఈ విషయం కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్‌కి అర్థమైంది. అందుకే తాను దర్శకత్వం వహించే తొలి సినిమాకి కథ విషయంలో లోటు చేయలేదు. అక్కడ కొత్తగా ఏదో చూపించాడు. దాంతో… ‘అంధగాడు’ కాస్త అందంగా తయారయ్యాడు. ఇంతకీ వెలిగొండ ఈ సినిమాలో చెప్పదలచుకొన్న కొత్త పాయింట్ ఏంటి? దాన్ని రక్తికట్టించగలిగాడా, లేదా? వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజ్ తరుణ్‌కి మరో హిట్ వచ్చిందా? చూద్దాం.. రండి.
* కథ
రాజ్ తరుణ్ ఓ అనాథ,అంథగాడు. అనాథాశ్రమంలో పెరిగి పెద్దవాడవుతాడు. రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. హెబ్బా పటేల్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. తనో కంటి డాక్టర్. కళ్లు లేనివాడ్ని కంటి డాక్టర్ ప్రేమిస్తుందా?? అనే అనుమానంతో తనకు కళ్లున్నట్టు నాటకం ఆడతాడు. అదీ తెలిసిపోతుంది. హెబ్బా.. రాజ్‌తరుణ్‌కి చూపు వచ్చేలా చేస్తుంది. అయితే అక్కడ్నుంచి రాజ్ తరుణ్ జీవితం మలుపు తిరుగుతుంది. తన కంటికి ఓ ఆత్మ కనిపిస్తుంటుంది. ఆ ఆత్మ రాజేంద్ర ప్రసాద్‌ది. నా కోసం నువ్వు రెండు హత్యలు చేయగలవా? అంటూ వెంటపడుతుంటుంది. చివరికి ఆత్మ గోల భరించలేక అందుకు ఒప్పుకొంటాడు రాజ్ తరుణ్. ఇంతకీ రాజేంద్ర ప్రసాద్ ఎవరు? ఆత్మ రాజ్ తరుణ్‌నే ఎందుకు వెంటాడుతోంది?? ఆత్మ ప్రతీకారం కోసం… రాజ్ తరుణ్ ఏం చేశాడు?? అనేదే కథ.
* విశ్లేషణ
ఒక్కో యాంగిల్ నుంచి చూస్తే… ఒక్కోలా కనిపించే కథ ఇది. కామెడీ, థ్రిల్లర్, హారర్… ఇలా అన్ని జోనర్లూ కనిపిస్తాయి. దర్శకుడు ఏదో ఓ జోనర్‌కి పరిమితం అవ్వలేదు. మామూలు మాటల్లో చెప్పాలంటే ఇదో రివైంజ్ డ్రామా. దాన్ని దర్శకుడు కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ట్విస్టులు, టర్న్‌లతో రక్తి కట్టించాడు. కథ ప్రారంభం నిదానంగానే నడిచింది. రాజ్‌తరుణ్, హెబ్బా, సత్య.. వీళ్ల చుట్టూనే కథ తిరిగింది. అక్కడ ఊహించని మలుపులేం కనిపించవు. కథ, కథనం, సన్నివేశాలు అన్నీ రొటీన్‌గానే సాగుతాయి. అయితే ఫన్ వర్కవుట్ అవ్వడంతో.. టైమ్ పాస్ అయిపోతుంది. సెకండాఫ్ ఈ కథకు కీలకం. దర్శకుడు తన స్టఫ్ అంతా అక్కడే దాచుకొన్నాడు. ద్వితీయార్థం మొదలయ్యాక.. ఈ సినిమా నడిచే జోనర్లు మారిపోతుంటాయి. ఇది హారర్ అనుకొంటారు.. థ్రిల్లర్ అనిపిస్తుంది.. చివరికి మైండ్ గేమ్ లా ముగుస్తుంది.
ద్వితీయార్థంలోనే దర్శకుడి పనితనం కనిపిస్తుంది. తన టాలెంట్ అంతా.. అక్కడే గుమ్మరించాడు. పతాక సన్నివేశాలు, అంతకు ముందు నడిచే డ్రామా.. తప్పకుండా ఆకట్టుకొంటాయి. ఏతావాతా.. చివరాఖరికి ఎలాగూ ప్రేక్షకుడు ఫన్ కోరుకొంటాడు కాబట్టి.. నవ్వులకు ఢోకా లేకుండా నడిపించాడు. సినిమాకి కీలకమైన ఓ ట్విస్ట్.. తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది. బహుశా అది నచ్చే.. రాజ్ తరుణ్ వెలిగొండ శ్రీనివాస్‌కి అవకాశం ఇచ్చి ఉంటాడు. ఆ ట్విస్ట్ లేకపోతే.. అంధగాడు కూడా రొటీన్ సినిమాగా మిగిలిపోయేదేమో.
* నటీనటులు
రాజ్ తరుణ్ ఈ సినిమాకి బలం. తన నటన, కామెడీ టైమింగ్, చూపించిన షేడ్స్.. ఇవన్నీ తప్పకుండా నచ్చుతాయి. రాజ్ ఈజ్‌ని దృష్టిలో పెట్టుకొనే ఈ కథ డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. గుడ్డివాడి పాత్ర తనేం అంత ఈజీగా తీసుకోలేదు. దానికి తగిన హోం వర్క్ చేసుకొనే వచ్చాడు. కళ్లు లేనప్పుడు, వచ్చిన తరవాత.. తన బాడీ లాంగ్వేజ్‌లో మార్పు చూపించాడు. హెబ్బా పాత్ర తొలి భాగానికి పరిమితమైంది. సెకండాఫ్‌లోనూ తను కనిపించినా తన పాత్ర పాటలకు మాత్రమే పరిమితం. అదేంటో.. ఒక్కోసారి ఒక్కోలా కనిపించింది హెబ్బా. తన మేకప్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. రాజేంద్ర ప్రసాద్ ది ఈ సినిమాలో ట్విస్టుకు కారణభూతమైన పాత్ర. రాజా రవీంద్రకు చాలా కాలం తరవాత.. మెయిన్ విలన్ కేటరిగీ పాత్ర దక్కింది. తను చక్కగానే నటించాడు. సత్య కావల్సినంత రిలీఫ్ అందించాడు.
* సాంకేతికత
టెక్నికల్ టీమ్‌లో దర్శకుడికే మార్కులు ఎక్కువ పడతాయి. టేకాఫ్‌కి టైమ్ తీసుకొన్నా…. ద్వితీయార్థంలో మాత్రం ఆకట్టుకొన్నాడు. స్క్రిప్టుని చాలా జాగ్రత్తగా రాసుకొన్నాడు. లాజిక్‌లు అడక్కుండా కేర్ తీసుకొన్నాడు. కామెడీ వర్కవుట్ అవ్వడంతో చిన్ని చిన్ని తప్పులు దొరక్కుండా దాక్కున్నాయి. డైలాగులు అక్కడక్కడ మెరిశాయి. సంగీతం ఈ సినిమాకి ప్రధాన మైనస్. సెకండాఫ్‌లో పాటలు మూడ్‌ని చెడగొట్టాయి. ఇలాంటి కథకు పాటలు అవసరమా?? అనేది దర్శక నిర్మాతలు ఆలోచించుకోవాలి.
ఇది దర్శకుడి తొలి ప్రయత్నం… అయినా… అన్ని విభాగాల్లో ఆకట్టుకొన్నాడు.
* ఫైనల్ పంచ్: అంధగాడే అయినా.. నచ్చేస్తాడు!
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5