ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మైక్రోసాఫ్ట్ సి.ఐ.ఓ. సత్య నాదెళ్ళ ఈరోజు ఉదయం హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ముప్పావు గంట సేపు సాగావలసిన వారి సమావేశం సుమారు గంటన్నరపాటు సాగింది. హైదరాబాద్ వచ్చిన సత్య నాదెళ్ళను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అల్పాహార సమావేశానికి ఆహ్వానించడంతో ఆయన అందుకు అంగీకరించి ఈ సమావేశానికి హాజరయ్యారు. విద్య, వ్యవసాయం, పౌరసేవలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు సత్య నాదెళ్ళ అంగీకరించారు. ముఖ్యంగా ప్రాధమిక స్థాయి నుండి హైస్కూల్ స్థాయి వరకు వివిధ కారణాలతో, సమస్యలతో మధ్యలో చదువు ఆపేస్తున్న విద్యార్ధుల సంఖ్యను పూర్తిగా తగ్గించదానికి అవసరమయిన సహాయ సహకారాలు అందించేందుకు సత్య నాదెళ్ళ అంగీకరించినట్లు తెలుస్తోంది.
అలాగే రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి భూసార పరీక్షలు, వాతావరణ పరిస్థితులు, సస్య రక్షణలో సరికొత్త విధానాలు తదితర అంశాలలో రైతులకు అవసరమయిన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ఆయన అంగీకరించారు. మైక్రోసాఫ్ట్ కొత్తగా అభివృద్ధి చేసిన ‘అజూర్’ సాఫ్ట్ వేర్ సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు సత్య నాదెళ్ళ అంగీకరించారని తెలుస్తోంది. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా తమ సంస్థ రాష్ట్రంలో చేపట్టబోయే కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించారు.
రాష్ట్రంలో ఐటి, సాఫ్ట్ వేర్ రంగం అభివృద్దికి సహకరించాలని అందుకోసం ఆంధ్రాలో పర్యటించవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్య నాదెళ్ళను కోరారు. విశాఖపట్నంలో ఇప్పటికే ఐటి, సాఫ్ట్ వేర్ సంస్థలు అనేకం స్థాపించబడి ఉన్నాయి కనుక విశాఖలో మైక్రోసాఫ్ట్ సంస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సత్య నాదెళ్ళను కోరారు. ఈ సమావేశానికి సత్య నాదెళ్ళ పావుగంట ముందే అంటే ఉదయం 7.45 గంటలకే చేరుకోగా, సంబందిత శాఖల అధికారులు మాత్రం ఆలస్యంగా చేరుకోవడం విశేషం.