ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన దాదాపు నాలుగున్నరేళ్ల తర్వతా… వంద శాతం.. రెండు రాష్ట్రాలు విడిపోయిన రోజుగా… 2019 జనవరి ఒకటి నిలుస్తోంది. ఇంత వరకూ.. రెండు రాష్ట్రాలకు హైకోర్టు ఉమ్మడిగానే ఉంది. ఈ రోజు నుంచి… ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం హైకోర్టులు ఏర్పడుతున్నాయి. ఇన్నాళ్లు హైకోర్టు విభజన వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ సారి మాత్రం.. జరిగిపోయింది. తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారాలు చేయడంతో హైకోర్టులు ఏర్పడినట్లవుతుంది.
ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల చేత.. గవర్నర్ నరసింహన్… హైదరాబాద్, విజయవాడల్లో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఏపీ హైకోర్టు భవనం ఇంకా రెడీ కాలేదు. విజయవాడలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయంలోనే కొన్నాళ్లపాటు హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇందులో 9 కోర్టుహాళ్లు సిద్ధం చేశారు. మరో హాలును మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఆర్ అండ్ బీ కార్యాలయంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన న్యాయమూర్తులంతా సోమవారం సాయంత్రానికే హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్నారు. 2వ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు అన్ని కోర్టు హాళ్లు పని చేస్తాయి. 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు. ఈ సమయంలో వెకేషన్ కోర్టును నిర్వహిస్తారు. ఇందులో ఇద్దరు మాత్రమే న్యాయమూర్తులు ఉంటారు.
అధికారికంగా విభజన పూర్తయినా… రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు మాత్రం ఇప్పుడల్లా పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన విషయంలో రెండు రాష్ట్రాల మధ్య పీట ముడి పడింది. వాటిని పరిష్కరించాల్సిన కేంద్రం.. సమస్యను మరింత జఠిలం చేస్తోంది కానీ.. రెండు రాష్ట్రాలకు అనుకూలమైన.. విభజన ఫార్ములాను సిద్దం చేయలేకపోతోంది. వివిధ రకాల కమిటీలు వేసి.. కాలయాపన చేస్తోంది. బయటకు ఓ రకంగా చెబుతూ.. కోర్టుల్లో మరో రకంగా అఫిడవిట్లు వేసి.. తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయతీ ఉంటేనే తమకు మంచిదన్నట్లుగా వ్యవహరిస్తోంది.