రాజకీయ నాయకులు-వ్యాపారస్తుల మధ్య ఉండే ‘సం’బంధాల గురించి కొత్తగా చెప్పేదేముంది. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే అద్దాల మేడల్లో ఉండే డబ్బున్నవాళ్ళ మధ్య ఉండే బంధాలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. నాయకుడైనా, వ్యాపారస్తుడైనా…వేరే ఏ డబ్బున్నవాడైనా సరే…అందరూ ఒకటే. కానీ ఒక్కటిగా ఉన్నట్టుగా కనిపించరు. ఎందుకంటే డబ్బున్నవాళ్ళంతా ఒకటే కులం, ఒకటే మతం అన్న క్లారిటీ తొంభై శాతం జనాలకు వచ్చిందంటే కోటీశ్వరుల కులానికే ప్రమాదం. మోడీ, సోనియా, కెసీఆర్, చంద్రబాబు, జగన్, పవన్…ఇంకా దేశంలో ఉన్న బోలెడుమంది నాయకులు. అంతు చూస్తాం అంటూ భారీ భారీ డైలాగులు పేల్చుకుంటూ ఉంటారు. కానీ అధికారం ఉన్నా, లేకపోయినా వాళ్ళంతా ఒక్కటే. అందరూ తప్పులు చేస్తున్నవాళ్ళే కాబట్టి ఆ తప్పులకు శిక్షలు పడేలా అస్సలు చేసుకోరు. కానీ జనాల ముందు మాత్రం అద్భుతమైన డ్రామాలు ఆడుతుంటారు. ఓటర్లందరూ కూడా తప్పనిసరిగా ఆ తప్పుడు జాతిలో ఉన్న ఎవడో ఒకడికి ఓట్లేసుకునేలా చేసుకుంటూ ఉంటారు. వేరేవాళ్ళకు వేస్తే ఓట్లు చీలిపోతాయి, వాడు బిన్ లాడెన్ అయినా సరే…గెలిచేవాడికే ఓటెయ్యండి లాంటి ప్రచారం మొదలెడతారు. ప్రతి ఐదేళ్ళకూ కూడా ఈ దొంగల్లోనే ఎవరో ఒక దొంగ అధికారంలోకి వచ్చేలా చేస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళూ అంతా బాగుంటారు. వాళ్ళ ఆస్తుల్లో, పరపతిలో సంవత్సరానికి సంవత్సరానికి బ్రహ్మాండమైన ఎదుగుదల కనిపిస్తుంది. కానీ మిగిలిన తొంభై శాతం మంది జీవితాల్లో మాత్రం ఆలోచించడానికి, ఆనందపడడానికి కూడా సమయంలేని పరిస్థితులను క్రియేట్ చేస్తారు.
తెలంగాణా ఉద్యమ సమయంలో లక్ష నాగళ్ళతో దున్నిస్తాం, ఆంధ్రా పెట్టుబడిదారులను తరిమేస్తాం, ఆంధ్రా నాయకులను ఏదో చేస్తాం అని ఒక రేంజ్లో మాటలు పేల్చారు ఉద్యమ నాయకులు. జనాలను బాగా రెచ్చగొట్టారు. సీమాంధ్ర, తెలంగాణాలలో రెచ్చిపోయిన జనాలు..వాళ్ళ జీవితాలకు వాళ్ళే నష్టం చేసుకున్నవాళ్ళు చాలా మందే ఉన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పనిచేసే ప్రదేశాల్లో ప్రాంతం పేరుతో తిట్టుకున్న జనాలు ఎందరో? కానీ సీమాంధ్ర, తెలంగాణా నాయకులు, పెట్టుబడిదారులు మాత్రం బ్రహ్మాండంగా కలిసి ఉన్నారు. తెలంగాణాలో నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మిస్తున్నవాళ్ళు సీమాంధ్ర కాంట్రాక్టర్లే. ఇక సీమాంధ్ర రాజకీయ నాయకులకు అయితే రాష్ట్రం విడిపోయిందన్న బాధ కూడా ఏమీ లేదు. ఎందుకంటే హైదరాబాద్‌లో వాళ్ళ ఆస్తులకు, పరపతికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఉద్యమకాలంలో లక్ష నాగళ్ళతో దున్నేస్తాం అని జనాలను రెచ్చగొట్టిన ఉద్యమనాయకుడే…అధికారంలోకి వచ్చిన వెంటనే…అద్భుతం, మహాద్భుతం, తెలంగాణాకే ఆణిముత్యం…అంటూ నాలుక మడతేశాడు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహా నగరంలో ఉన్న వందలాది ఎకరాలను జస్ట్ వేల రూపాయలకు అప్పనంగా రాసిచ్చేస్తున్నాడు. భవిష్యత్‌లో ఇంకా కూడా ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారట. కోటీశ్వరలు కులస్థులు మధ్య ఉండే ఇలాంటి ‘సం’బంధాలను ఎవరూ ఏమీ చేయలేరు. వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. అధికారం, డబ్బు, బలం, బలగం అన్నీ వాళ్ళ అధీనంలో ఉంటాయి.
పదిశాతం కోటీశ్వరుల కులస్థుల విషయం పక్కనపెడితే మిగతా వాళ్ళు తెలుసుకోవాల్సిన నీతి మాత్రం చాలా ఉంది. ఆ కోటీశ్వరుల భజన చేయడం మానేయాలి. ఆ కోటీశ్వరుల కోటలకు కూలీలం కాదు అన్న విషయం తెలుసుకోవాలి. బలహీనులందరూ కలిస్తే ఎక్కడ బలవంతులవుతారో అన్న ఉద్ధేశ్యంతో కులాలు, ఉపకులాలు, వర్గాలు, మతం, ప్రాంతం…అంటూ ఇంకా ఎన్నో రకాలుగా కోటీశ్వరుల కులస్థులు కట్టిన అడ్డుగోడలను కూల్చేయాలి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఉన్న కులాలు రెండే. ఉన్నవాడు…లేనివాడు. ఉన్నవాళ్ళందరూ కూడా ఉమ్మడిగా ఉంటూ ఒకరి ప్రయోజనాలను ఒకరు బాగానే కాపాడుకుంటున్నారు. లేనివాళ్ళలో కూడా ఆ యూనిటీ వస్తే కొంచెం అయినా బెటర్‌గా ఉంటుందేమో. ఎందుకంటే ఉన్నవాళ్ళ దోపిడీని అడ్డుకునే వ్యవస్థలు, శక్తులకు అస్తిత్వం లేకుండా చేసిన గొప్ప అభివృద్ధిని సాధించిన సమాజం కదా మనది.