ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఓ స్టాండ్ అంటూ లేకుండా పోయింది. మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటూ.. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా.. ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తూ ఉండేవారు. తమ పార్టీలో క్రమశిక్షణ ఎక్కువని.. అలా ఎవరూ.. వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పరని.. బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నేను కేంద్రంతో మాట్లాడే చెబుతున్నా అంటారు సుజనా చౌదరి… ఒక్క అంగుళం రాజధానిని కదిలించినా ఒప్పుకునేది లేదని నేరుగా వైసీపీకి వార్నింగ్‌లు ఇచ్చేస్తూ ఉంంటారు. కానీ జీవీఎల్ నరసింహారావు మాత్రం.. ఎవరూ చెప్పిన వ్యక్తిగత అభిప్రాయాలే.. తాను చెప్పేది ఫైనల్ అంటూ.. మీడియా ముందు కుండబద్దలు కొట్టేస్తున్నారు. ఇంతా చేసి.. ఆయన పార్టీ అభిప్రాయం చెబుతున్నారా అంటే… రాజధాని మార్పు విషయంలో కేంద్రానికేం సంబంధం లేదని మాత్రమే చెబుతున్నారు. గతంలో రాజధాని ఏర్పాటు చేసేటప్పుడు.. కేంద్రం సలహా ఇవ్వలేదని.. ఇప్పుడు మార్చేటప్పుడు కూడా ఇవ్వబోదని అంటున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సహా.. అందరూ అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటనలు గురించి .. జీవీఎల్ తేలికగా తీసుకుంటున్నారు. తాను చెప్పేదే ఫైనల్ కాబట్టి.. మిగిలిన వారివన్నీ వ్యక్తిగత అభిప్రాయాలంటున్నారు. నిజానికి జీవీఎల్ జాతీయ పార్టీ అధికార ప్రతినిధి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంపీ. ఆయన జాతీయ రాజకీయాల గురించి మాత్రమే తన విధానాలను చెప్పగలరు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఉన్నారు.. అధికార ప్రతినిధులు కూడా ఉన్నారు. కానీ వారందరి అభిప్రాయాలు వ్యక్తిగతమే అంటున్న జీవీఎల్.. తానే పార్టీకి పెద్ద దిక్కు అని.. తాను చెప్పిందే.. పార్టీ విధానం అన్నట్లుగా చెప్పడమే … బీజేపీలో.. కొత్త తరహా చర్చకు కారణం అవుతోంది. ఓ వైపు.. కన్నా.. సుజనా చౌదరి చాలా దూకుడుగా అమరావతి మార్పునకు వ్యతిరేకంగా వెళ్తున్నారు.
సోము వీర్రాజు, జీవీఎల్ లాంటి వాళ్లు మాత్రం.. నేరుగా సపోర్ట్ చేయకపోయినా.. జగన్ నిర్ణయాలపై వ్యతిరేకత లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. దీంతో.. బీజేపీలోనే.. ఏదో జరుగుతోందన్న చర్చ మాత్రం ప్రారంభమయింది. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం బీజేపీలో నేతలు .. తమ తమ ప్రాధాన్యతను చాటుకోవడానికి ఉపయోగించుకుంటున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీకి..గత కాంగ్రెస్ బాటలోనే పయనిస్తోంది.