పాపం… ఆంధ్రప్రదేశ్ లో భాజపా నేతల పరిస్థితి ఏంటో, ఎన్ని మారుతున్నా వారికి ఇరకాటం తప్పడం లేదు! కేంద్రంలో తిరుగులేని అధికారంలో ఉన్నా… రాష్ట్ర నేతలకు ఎప్పుడూ సంతృప్తి, స్వేచ్ఛ ఉండటం లేదనే చెప్పాలి! గతంలో టీడీపీతో భాజపా పొత్తు ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నా.. రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రాధాన్యత దక్కేది కాదు. దాంతో, చంద్రబాబు తీరుపై అసంతృప్తి ఉన్నా కూడా… భాజపా అధినాయకత్వానికి ఫిర్యాదు చెయ్యలేక, రాష్ట్రంలో తమ ప్రాధాన్యతను పెంచుకోలేక సతమతమౌతూ వచ్చారు. ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి టీడీపీ బయటకి రాగానే… కాస్త ఊపిరి పీల్చుకుని, టీడీపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలో లేదు, పైగా ఆ పార్టీ నేతలే భాజపాలోకి వస్తున్నారు. అయినాసరే, ఏపీ భాజపా నేతలకు ఇంకా అదే ఇరకారట పరిస్థితి కొనసాగుతున్నట్టుంది!
నలుగురు టీడీపీ ఎంపీలు భాజపాలో చేరారు కాదా! అయితే, వారి చేరికలపై ఏపీ నేతల్లో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నట్టు సమాచారం. టీడీపీ నేతల్ని చేర్చుకోవడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదుగానీ… చేర్చుకునే ముందు రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను కూడా పరిగణించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని కొంతమంది ఏపీ నేతలు వ్యక్తం చేస్తున్నారట! ఆంధ్రాలో పార్టీ బలోపేతం కావాలంటే వివిధ కేసుల్లో సీబీఐ, ఈడీ విచారణలు ఎదుర్కొంటున్నవారికి చేర్చుకోవడం సరైంది కాదని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. ఇలాంటి నాయకులకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తే… ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనేది వారి ఆవేదనగా తెలుస్తోంది.
వీరి ఆవేదనలో మరో కోణం… ఎప్పట్నుంచో రాష్ట్రంలో ఉంటున్న తమ కంటే, కొత్తగా వస్తున్న వారికి పార్టీలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందనేది! అలాంటప్పుడు వీళ్లయినా ముందుగా అధినాయకత్వంతో మాట్లాడి, తీసుకునే ముందు తమని సంప్రదించలేదు, అభియోగాలు ఎదుర్కొంటున్నవారు వద్దు అనే విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి చెప్పొచ్చు కదా. కానీ, ఆ ధైర్యం వీళ్లు చెయ్యలేదు. అమిత్ షా నిర్ణయాలను ఎలా వ్యతిరేకిస్తామని తిరిగి వారే అంటున్న పరిస్థితి ఉంది! ఏపీ భాజపా నేతలు ఎంత కాదనుకున్నా… రాష్ట్రంలో పార్టీ బలపడటానికి సీఎం రమేష్, సుజనా చౌదరి సాయం చాలా అవసరమౌతుంది. అలాంటప్పుడు, వారికే జాతీయ నాయకత్వం ప్రాధాన్యత ఇస్తుంది కదా! కొత్తవారి చేరికలపై రాష్ట్ర నేతలు కొంత అసంతృప్తితో ఉన్నారని జాతీయ నాయత్వానికి తెలిసినా ఏమౌతుంది… సర్దుకుపోవాలని సలహా ఇస్తుంది, అంతే కదా!