తెలుగు మీడియా రంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వంద శాతం తెలంగాణ వాదం.. ఆంధ్ర వ్యతిరేకతతో ప్రారంభమైన టీ న్యూస్‌కు ఆంధ్రా సీఈవో వచ్చారు. ఇప్పటి వరకూ ఎన్టీవీ గ్రూప్‌లో ఉన్న వి.సుందర రామ శాస్త్రి అలియాస్ వీఎస్ఆర్ శాస్త్రి టీ న్యూస్ కొత్త సీఈవోగా నియమితులయ్యారు. ఆయన నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తికి అత్యంత సన్నిహితులు. ఇద్దరు ఈనాడులో కలిసి పని చేశారు. తిగుళ్లకు చాలా సీనియర్ అయిన వీఎస్ఆర్ స్వామిని తిగుళ్ల టీ న్యూస్ సీఈవోగా నియమించడంలో కీలక పాత్ర పోషించారు. తిగుళ్ల కృష్ణమూర్తి నిన్నామొన్నటి వరకూ ఆంధ్రజ్యోతిలో ఉండేవారు.
ఆయనకు కేసీఆర్ నమస్తే తెలంగాణ పత్రిక బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు టీ న్యూస్ బాధ్యతలు కూడా ఇచ్చారు. దీంతో ఆయన సీఈవోగా వీఎస్ఆర్ శాస్త్రిని నియమించేలా అంగీకరింపచేశారు. ఈ మార్పు కాస్త అనూహ్యమే. ఎందుకంటే వీఎస్ఆర్ శాస్త్రిది ఆంధ్రా నేపధ్యం. పైగా ఆయన రిటైర్మెంట్ వయసు అయిపోయి చాలా కాలం అయింది. మరో వైపు టీ న్యూస్ ఇన్పుట్ ఎడిటర్‌గా చానల్లో కీలక పాత్ర పోషిస్తున్న పీ.వీ శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై స్పష్టత లేదు.
మరో వైపు మిణుకుమిణుకుమంటున్న హెచ్ఎంటీవీ సీఈవో గా ఉన్న చంద్రశేఖర్ అనే వ్యక్తి కూడా రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. హెచ్ఎంటీవీ దురదృష్టం ఏమిటో కానీ ఇప్పటి వరకూ ఒక్క ప్రొఫెషనల్ కూడా ఆ చానల్ ను నిటారుగా నిలబెట్టలేకపోయారు…తాము నిలబెట్టలేకపోయారు. వస్తున్నారు.. వివాదాలతో పోతున్నారు. ఎంత ఖర్చు అయినా కపిల్ చిట్స్ ఓనర్ అయిన .. హెచ్ఎంటీవీ ఓనర్ చానల్‌ను నడుపుతూనే ఉన్నారు.