వరదలు, వరద బాధితుల విషయంలో సీఎం జగన్ నాన్ సీరియస్‌గా ఉన్నారని ఓ వైపు బాధితులు ఆక్రందనలు అంతటా వినిపిస్తున్న సమయంలోఆయన విందులు, వినోదాలకు వెళ్లడంతోనే క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు హఠాత్తుగా ఏపీలో తీవ్రమైన వరదలొచ్చేశాయని.. ఆరున్నర వేల కోట్ల నష్టం జరిగిందని.. సహాయ, పునరావాసాల కోసం తక్షణం రూ. వెయ్యి కోట్లు పంపాలని సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు ఎందుకైనా మంచిదని అనుకున్నారో లేకపోతే.. ఆయన చెప్పకపోతే మోడీ కూడా పైసా ఇవ్వరని అనుకున్నారేమో కానీ అమిత్ షాకు కూడా ఓ లేఖ విడిగా రాశారు.
నాలుగు జిల్లాలో 160 మండలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని జగన్ లేఖలో పేర్కొన్నారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా విస్తృత చర్యలు తీసుకున్నామని 324 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. తక్షణం వరద సాయం అందించాలని లేఖల్లో జగన్ కోరారు. వరదలు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ .. సీఎం జగన్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వాకబు చేశారు. అవసరమైన సాయం అందిస్తామని ప్రజలను కాపాడాలన్నారు. కేంద్ర బృందాలు వచ్చి ప్రజల రక్షణ చర్యల్లో పాల్గొన్నాయి. సాధారణంగా ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కేంద్రం సాయం చేస్తుంది. ఈ సారి అలాంటి సూచనలు లేకపోవడంతో సీఎం స్వయంగా లేఖ రాసినట్లుగా భావిస్తున్నారు.
అయితే ఇంత వరకూ ముఖ్యమంత్రి జగన్ ఓ గంట ఏరియల్ సర్వే చేశారు తప్పితే.. వరద బాధిత ప్రాంతాలకు ప్రత్యక్షంగా వెళ్లలేదు. పరిశీలించలేదు. బాధితులతో మాట్లాడలేదు. ఆయన అంత నాన్ సీరియస్‌గా ఉంటే కేంద్రం మాత్రం ఎందుకు అంత సీరియస్‌గా ఉంటందన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కేంద్రం నిబంధనల ప్రకారం చేయాల్సిన సాయం ఎప్పటికైనా చేస్తుంది కానీ ప్రభుత్వం తన ప్రయత్నం తాను సిన్సియర్‌గా చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితే కనిపించడం లేదు.