ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పాపమంతా టోకున కాంగ్రెస్ నెత్తిన పడింది. దీంతో గడచిన ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కసీటూ దక్కించుకోలేకపోయిన సంగతి తెలిసిందే. అయితే, పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా నెత్తినేసుకుని, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటికి అనూహ్యమైన స్పందన కూడా రావడం లేదు. తాజాగా ఇలాంటిదే మరో కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. జూన్ 4న గుంటూరులో ఒక సభను కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టింది. ప్రత్యేక హోదా భరోసా పేరిట ఈ సభ జరుగుతుంది. ఇస్తామన్న హోదాను భాజపా ఇవ్వలేదనీ, తెలుగుదేశం సర్కారు కూడా దాన్ని వదిలేసిందనీ, ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే అది కాంగ్రెస్ ద్వారా మాత్రమే సాధ్యమన్న భరోసాను ప్రజలకు కల్పించడమే ఈ సభ ముఖ్యోద్దేశం అని తెలుస్తోంది.
ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తారనీ, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా హాజరౌతారని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారట! ప్రత్యేక హోదా సాధన కోసం పవన్ కల్యాణ్ ఎప్పట్నుంచో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక, వైకాపా కూడా హోదా డిమాండ్ ను ఇంకా వదల్లేదు. దాన్ని ఎన్నికల అంశంగా మార్చే క్రమంలో ఉంది. అయితే, పవన్ జగన్ లు ఒకే అంశంపై పోరాటం చేస్తున్నా… ఒకే వేదికపైకి వచ్చిన సందర్భాలు లేవు. అందుకే, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా వీరిని ఆహ్వనించింది. హోదా అంశంపై పోరాడుతున్న పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాలని కాంగ్రెస్ ఆకాంక్షిస్తోంది. అయితే, నిజంగానే జగన్, పవన్ లు ఈ కార్యక్రమానికి వస్తారా అనేది ప్రశ్న?
పవన్ పోరాటం తీసుకుంటే… ప్రత్యేక హోదాపై జనసేనది సోలో పర్ఫార్మెన్స్. జగన్ తీరు కూడా అంతే! ఈ ఇద్దరూ ఒక వేదికపైకి వస్తారన్నది ఊహించలేం. ప్రాక్టికల్ గా చూసుకున్నా.. జగన్ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నారు. పదో తేదీన తిరిగి వస్తారట. అలాంటప్పుడు 4న జరిగే సభకు ఎలా వస్తారు..? ఓవరాల్ అర్థమౌతున్నది ఏంటంటే…జగన్, పవన్ పేర్లతో ఈ సభకు ప్రాధాన్యత పెంచాలన్నది కాంగ్రెస్ వ్యూహం. నిజానికి, ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపడుతున్నా ప్రజల నుంచి మినిమమ్ స్పందన కూడా రావడం లేదు. ఏపీ కాంగ్రెస్ కి ఒక స్టార్ కేంపెయినర్ కావాలి. జగన్ లేదా పవన్ లాంటి కరిజ్మాటిక్ ఫేస్ అవసరం పార్టీకి ఉంది! వారు ఎలాగూ కాంగ్రెస్ తో కలిసి ముందుకు సాగే పరిస్థితి ప్రస్తుతానికైతే కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన సోలోగానే బరిలోకి దిగుతుంది అంటున్నారు. ఇక, కాంగ్రెస్ తో వైకాపా కలిసే అవకాశాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ మరోసారి జనాకర్షకంగా మారడం అంటే… కష్టసాధ్యంగానే కనిపిస్తోంది. ఇంతకీ, ఈ గుంటూరు సభ ఏ మేరకు సక్సెస్ చేసుకుంటుందో చూద్దాం.