రాజధానిలో భూములను ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గుంటూరు, విజయవాడల్లో… ఇళ్ల స్థలాల కోసం ధరఖాస్తు చేసుకున్న వారి దగ్గర నుంచి.. అక్కడి భూమి తీసుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదన్న అంగీకార పత్రాలను.. వాలంటీర్లు తీసుకుంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ సర్కార్లో… ప్రస్తుత లబ్దిదారుల్లో చాలా మందికి ఇళ్లు మంజూరయ్యాయి. విజయవాడ పేదలకు జక్కంపూడి, గుంటూరు పేదలకు ఆ చుట్టుపక్కల ఇళ్లను నిర్మించారు. చివరి దశలో ఉన్న వాటిని ప్రభుత్వం పంపిణీ చేయలేదు. రాజధాని గ్రామాల్లోనూ.. పేదల కోసం.. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసింది. వాటినీ పంపిణీ చేయలేదు. వాటిని నిలిపివేసి… ఇప్పుడు ఒక్కొక్కరికి రాజధాని భూముల్లో సెంటు స్థలం ఇస్తామని.. తీసుకోవాలని అంగీకార పత్రాలు తీసుకుంటున్నారు.
నవతర్నాల పధకంలో భాగంగా 25లక్షల మందికి సెంటు చొప్పున స్థలం ఇస్తామని ప్రకటించారు. ఉగాది నాటికి ఈ స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అనేక ప్రాంతాలలో అంతమందికి ఇచ్చేందుకు అనువైన స్థలం దొరకకపోవడంతో.. అమరావతిలోని వివిధ గ్రామాలలో స్థలం కేటాయించేందుకు రంగం సిద్దం చేశారు. రాజధానిలో కీలక విభాగాలు ఉన్న ప్రాంతంలో స్థలాల కేటాయింపు పెను వివాదంగా మారనుంది. రైతులు తీవ్ర ఉద్యమం చేస్తున్న సమయంలో.. తమకు భూములు కేటాయించడం ద్వారాతో… వారితో ఘర్షణలు పెట్టాలని చూస్తోందన్న అభిప్రాయం.. లబ్దిదారుల్లో వ్యక్తమవుతోంది.
అమరావతిలో రైతులు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చారని, పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు భూములు ఇవ్వలేదు. ఈ విషయం పై ఇప్పటికే కోర్టులో పిల్ కూడా పెండింగ్ లో ఉంది. రాజధానిలో హైకోర్టు, సచివాలయం, యూనివర్సిటీలు ఉన్న ప్రాంతంలో సుమారు నాలుగు వేల ఎకరాలను గుర్తించి పేదలకు పంపిణీ చేయడం పట్ల రైతుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. రాజధానిని నిర్వీర్యం చేయడంలో భాగంగానే ఇటువంటి కుట్రలకు ప్రభుత్వం పాల్పడుతుందని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్థలాల్ని మార్కింగ్ చేసి..లబ్దిదారులకు కేటాయించిన తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోయే ప్రమాదం కనిపిస్తోంది.