నిమ్మగడ్డ రమేష్ కుమార్..హైకోర్టు ఆదేశాల మేరకు.. సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలవనున్న నేపధ్యంలో… ఏపీ సర్కార్ అనూహ్యమైన అడుగు వేసింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఏపీ సర్కార్ .. నిమ్మగడ్డను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ ఎస్ఈసీ పదవిలో కూర్చోకుండా చూడాలన్న పట్టుదలతో ఉంది. గతంలో ఆయనను తొలగిస్తూ.. తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేసినప్పటికీ.. స్టే కోసం.. మూడు సార్లు వివిధ పద్దతుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ మూడు సార్లు ఎదురు దెబ్బలే తగిలాయి. అయినప్పటికీ.. హైకోర్టు తీర్పును అమలు చేయలేదు.
దీంతో.. నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఏపీ సర్కార్ కోర్టు ధిక్కరణకు పాల్పడిందని.. హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. గవర్నర్‌ను కలిసి.. వినతి పత్రం ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పుడు.. ఏపీ సర్కార్.. ఈ తీర్పుపైనా స్టే కోసం… సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ తీర్పులో స్టే వస్తే.. ఇక నిమ్మగడ్డను.. ఇప్పటికిప్పుడు విధుల్లో చేర్చుకోవాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే.. ఏపీ సర్కార్ .. కోర్టులతో ఆడుకుంటున్న వైనం చూసి.. న్యాయనిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో స్టే రాకపోయినప్పటికీ.. హైకోర్టు తీర్పును ధిక్కరించడమే కాకుండా.. అదే అంశంపై మళ్లీ సుప్రీంకోర్టులో స్టే పిటిషన్ దాఖలు చేయడం ఏమిటని.. ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
అయితే.. ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి.. న్యాయవ్యవస్థతో ఇంతే వ్యవహరిస్తోంది. వివిధ రకాల పిటిషన్లతో… ఎంత వీలైతే.. అంత ఆలస్యం చేసి.. పని పూర్తి చేసుకునే వ్యూహాన్ని అమలు చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సోమవారం నిమ్మగడ్డ గవర్నర్ ను కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చిన తర్వాత ఆయన ఎలా స్పందిస్తారన్నది కీలకంగా మారింది. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ వేసినందున వేచి చూస్తానని ఆయన సైలెంటయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సుప్రీంకోర్టులో వచ్చే స్పందనను.. బట్టి.. నిమ్మగడ్డ విషయంలో తదుపరి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.