ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం “రంగుల మిషన్” ప్రారంభించింది. కొత్తగా కట్టింది ఏమీ లేకపోయినా.. ఉన్న ప్రభుత్వ భవనాలన్నింటికీ.. వైసీపీ రంగులు వేసేస్తున్నారు. స్మశానాలు, సామూహిక మరుగుదొడ్లు సహా.. దేన్ని వదిలి పెట్టడం లేదు. ఇక పంచాయతీ భవనాలను ఎలా వదిలి పెడతారు. ఇప్పుడు వైసీపీ రంగులతో అవన్నీ వైసీపీ పార్టీ కార్యాలయాలుగా కనిపిస్తున్నాయి. ఈ రంగులు వేయడానికి రూ. 1300 కోట్లు ఖర్చు పెడుతున్నారని.. బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎంత ఖర్చుపెడుతున్నామో ప్రభుత్వం మాత్రం చెప్పడం లేదు కానీ.. చాలా పెద్ద మొత్తమే దీని కోసం వెచ్చిస్తున్నట్లుగా.. ఊరూవాడా కనిపిస్తున్న రంగులే నిరూపిస్తున్నాయి. ఎలా చూసినా.. ఇవన్నీ అధికారిక రంగులు కాదు. కేవలం.. వైసీపీ రంగులు. మరి ఎన్నికల కోడ్ వస్తే.. ఆ రంగులను ఏం చేస్తారు..?
దేశంలో ఎన్నికల కోడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఓటర్లను ప్రభావితం చేసే…ఏ అంశానికి అయినా.. కోడ్ సమయంలో… ముసుగుపడాల్సిందే. అందుకే విగ్రహాలకు ముసుగేస్తారు. శంకుస్థాపన ఫలకాలకూ ముసుగేస్తారు. ఇప్పుడు… వైసీపీ రంగులు ఉన్న ప్రభుత్వ భవనాలు.. పంచాయతీ కార్యాలయాలు కనిపిస్తున్నాయి. వాటినేం చేస్తారనేది.. చాలా మంది వస్తున్న డౌట్. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ బూత్‌లన్నీ.. దాదాపుగా.. పంచాయతీ భవనాల్లోనో.. స్కూళ్లలోనో ఉంటాయి. ఓటింగ్ సమయంలో ఆ భవనాలకు వైసీపీ రంగులు ఉంటే..ఎన్నికల కోడ్‌కు విరుద్ధం. ఒక్క గ్రామ పంచాయతీనే కాదు.. ఎలాంటి ఎన్నికలు జరిగినా.. వైసీపీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు ఉండటం కోడ్ ఉల్లంఘనే. అంటే.. మళ్లీ వాటన్నింటికీ తెల్లరంగు వేయాలి. లేదా.. ముసుగులేయాలి. భవనాలకు ముసుగులేసే టెక్నాలజీ ఇంకా రాలేదు కాబట్టి.. తెల్ల రంగే వేయాలి.
ఇప్పుడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగుల కోసం రూ. 1300 కోట్లు ఖర్చుపెడితే.. ఎన్నికల కోడ్ రాగానే.. మరో రూ. 1300 కోట్లు ఖర్చుపెట్టి.. వాటికి తెల్ల రంగులేయాలి. ఎన్నికలు అయిపోగానే.. మళ్లీ మరో రూ. 1300 కోట్లు పెట్టి రంగులేసుకోవాలి. మళ్లీ ఎన్నికలు రాగానే… ఈ సైకిల్ ఇలా కొనసాగుతుందన్నమాట. ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని.. మాటలు చెబుతున్న ఏపీ సర్కార్.. తాము చేయని అభివృద్ధి పనులకు.. తమ పార్టీ రంగులేసుకోవడానికి .. ఇలా వందల కోట్లు వెచ్చించడం… సాధారణ ప్రజలను సైతం విస్మయపరచకుండా ఎలా ఉంటుంది