ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన హామీల అమలుపై .. సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం.. పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన ఓ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. దానిలో ఇంప్లీడ్ కావడం కన్నా.. సొంతంగా పిటిషన్ దాఖలు చేస్తే మంచిదని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది దీని కోసం న్యాయపరమైన ప్రక్రియ పూర్తి చేసి.. ముందుకెళ్లాలని తీర్మానించారు. తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వేసిన పిటిషన్ పై…కేంద్రమంత్రిత్వ శాఖలు వరుసగా అఫిడవిట్లు దాఖలు చేసుకుంటూ వెళ్తున్నాయి.
మొదట ఉక్కు శాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. బయ్యారం, కడపల్లో ఉక్కు పరిశ్రమలు పెట్టడం సాధ్యం కాదని ఆ అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ కౌంటర్ పిటిషన్ వేసింది. ఇందులో విభజన చట్టంలో హామీలన్నింటిని నెరవేర్చామని.. ఇక ప్రత్యేకంగా ఇవ్వాల్సిందేమీ లేదని పేర్కొంది. ఆర్థిక సంఘం సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వలేమని కూడా స్పష్టం చేసింది. ఆ తర్వాత జలవనరుల శాఖ… పోలవరంపై అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో ఎలాంటి వివరాలు లేవు. ఈ అఫిడవిట్లన్నీ ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించాయి. తెలుగుదేశం పార్టీతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రంపై తీవ్రంగా విమర్శలు గుప్పించింది. అఫిడవిట్లలో పేర్కొన్నవన్నీ అబ్దదాలని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది.
ఏపీ మంత్రి వర్గం కూడా.. సుప్రీంకోర్టులో కేంద్ర ఆర్థిక శాఖ వేసిన అఫిడవిట్ పై సుదర్ఘంగా చర్చించింది. విభజన చట్టానికి కొత్త అర్థాలు చెప్పుకుంటూ.. తమకు ఇష్టం వచ్చినట్లు అఫిడవిట్ వేశారన్న అభిప్రాయం కేబినెట్ లో వ్యక్తమయింది. దీనిపై న్యాయపోరాటం చేయాల్సిందేనని నిర్ణయించారు. విభజన హామీలు అమలు చేయడం లేదంటూ… సొంతంగా పిల్ దాఖలు చేయాలని అంతిమంగా డిసైడయ్యారు. దీంతో.. వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరినట్లవుతుంది. విభజన చట్టంలోని సాంకేతిక అంశాలను చూపించే కేంద్రం విభజన హామీలపై నిర్లిప్తత ప్రదర్శిస్తుంది. మరి కోర్టులో దీనిపై వాదనలు ఎలా సాగుతాయో అంచనా వేయడం కష్టమే.