ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల మంత్రి గౌతంరెడ్డి ట్విట్టర్‌ను హ్యాక్ చేసి.. అందులో అశ్లీల బొమ్మలు పెట్టాలనే సరదా హ్యాకర్లకు ఎక్కువగా ఉన్నట్లుగా ఉంది. ఆయన ట్విట్టర్ అకౌంట్లలో తరచూ అలాంటి బొమ్ములు కనిపిస్తూ ఉంటాయి. ఆయనది అధికారిక ట్విటర్ అకౌంట్. వెరీఫైడ్ ఖాతా కూడా. అంత సామాన్యంగా హ్యాక్ కావడం అనేది సాధ్యం కాదు. అయినప్పటికీ అప్పుడప్పుడు అందులో బూతుబొమ్ములు షేర్ చేస్తూండటంతో మంత్రిగారికి ఇదేం పిచ్చి అనుకున్నారు. కొంత మంది అన్ ఫాలో అయ్యారు. అయితే ఇప్పుడు ఆయన తప్పు తెలుసుకుని అందరికీ ఓ విజ్ఞాపన చేశారు. అదేమిటంటో.. తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని.. అలాంటి పోస్టులు తన ట్విట్టర్ ఖాతాలో కనిపించినందుకు సారీ చెప్పారు.
గౌతం రెడ్డి ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం ఇదే మొదటి సారి కాదు. గౌతంరెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో సినిమా హీరోయిన్ కాజల్ గురించి పోస్టులు దర్శనమిచ్చాయి. అదీ కూడా అర్థరాత్రి పూట షేర్ చేసినవి కావడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయ్యాయి. అప్పుడు కూడా గౌతం రెడ్డి… తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని చెప్పి… తొలగించారు. అప్పట్లో ఆ వివాదం సద్దుమణిగింది. తాజాగా మళ్లీ… ఆయన ట్విట్టర్ ఖాతాలో బూతుబొమ్మలు దర్శనమిచ్చాయి. దాంతో మరోసారి తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
స్వయంగా ఐటీ మంత్రి… కాబట్టి.. తన ట్విట్టర్ ఖాతాను ఎవరు హ్యాక్ చేశారో… తెలుసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా చెప్పుకొచ్చారు. అలాగే ట్విట్టర్ సంస్థకూ లేఖ రాశారు. ఒకసారి హ్యాక్ చేస్తే ఏదో అనుకోవచ్చు కానీ..పదే పదే హ్యాక్ చేసి.. అశ్లీల చిత్రాలు పెట్టడం అంటే.. మంత్రిగారు పాస్వర్డ్ అందరికీ తెలిసిపోయేలా పెట్టుకున్నారేమోనన్న సెటైర్లు పడుతున్నాయి. ఏమైనా రాజకీయాల్లో ఉన్న వారి సోషల్ మీడియా అకౌంట్లను జాగ్రత్తగా చూసుకోవాలి. తేడా వస్తే వారేమీ చెప్పడానికి కూడా నమ్మకుండా ప్రజల్ని నమ్మించేసే ఘనాపాటీలు రాజకీయాల్లో ఉన్నారు.