విశాఖకు రావాల్సిన అతి పెద్ద షాపింగ్ మాల్ .. తమిళనాడుకు వెళ్లిపోయింది. అక్కడ ప్రారంభానికి కూడా సిద్ధమయింది. ఈ విషయం బయటకురావడంతో మరోసారి గగ్గోలు రేగింది. లూలూ అంటే… ప్రపంచవ్యాప్తగా షాపింగ్ మాల్స్ లో ఓ ప్రత్యేకమైన స్థానం ఉన్న కంపెనీ. దుబాయ్ లో అత్యంత విలాసవంతమైన మాల్స్ ను ఈ సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు చొరవతో.. చంద్రబాబు పట్టుదలతో విశాఖలో భారీ మాల్ నిర్మించడానికి ఈ సంస్థ ముందుకు వచ్చింది. కనీసం ఏడు వేల మందికి ఉపాధి లభిస్తుందని అంంచనా వేశారు.
బీచ్ రోడ్ లో స్థలం కేటాయించారు. ఆ స్థలానికి కూడా ఏటా ఎనిమిది కోట్ల రూపాయల లీజు నిర్ణయించారు. అయితే పార్టీ ఆఫీసుకు ఐదు .. పది రూపాయలకు స్థలాలిచ్చుకున్న వైసీపీ.. ఏడు వేల మందికి ఉపాధినిచ్చే లూలూ మాల్ మాత్రం దండగ అనుకుంది. కేటాయించిన స్థలం వెనక్కి తీసుకుంది. దీంతో దండం పెట్టేసిన ఆ కంపెనీ… పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయింది. అంతే కాదు.. తాము ఇక ఏపీ లో పెట్టుబడులు పెట్టే ప్రసక్తే లేదని ప్రకటించింది. అయినా ఏపీలో ఎవరికీ చీమకుట్టినట్లయినా లేదు. అదొక్కటేనా… సొంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాడనికి అమెరికా నుంచి వచ్చి అంతర్జాతీయ బ్రాండ్ ను రూపొందించిన అమరరాజా కంపెనీ వాళ్ల కొత్త ఫ్యాక్టరీనే ఏపీ నుంచి తరిమేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు.
ఎలా చూసినా గత ప్రభుత్వం ప్రతిపాదనల దశకు తెచ్చిన ఎన్నో పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. జాకీ పరిశ్రమ.. కియా అనుబంధ పరిశ్రమలు.. ఇలా లెక్కలేనన్ని పరిశ్రమల్ని తరమేశారు. ఏపీ ప్రజలకు ఉపాధిని పరిమితం చేశారు. అయినా … తమ దగ్గర పిండుకుంటున్న పన్నుల్లో ఓ ప దివేలు తమ ఖాతాల్లో వేస్తున్నారని సంతోషపడేవాళ్లు ఉన్నారు. అందుకే ఏపీ పారిశ్రామికాభివృద్ధి ఎవరికీ పట్టడం లేదు. పట్టిన వాళ్లు ఇదేం ఖర్మ అనుకుంటున్నారు కానీ ఏమీ చేయలేని పరిస్థితి.