సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. పారిశ్రామిక ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాల అమలును ప్రాతిపదికగా ప్రపంచ బ్యాంక్ తో కలిసి కేంద్రం.. ఈ ర్యాంకుల్ని ప్రకటిస్తున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా 98.42 శాతం ప్రగతి సూచీని నమోదు చేసింది. తెలంగాణ 98.33 శాతం ప్రగతి సూచితో రెండో స్థానంలో నిలిచింది. సరళతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాణిజ్యంలో పాయింట్లలోచాలా స్వల్ప తేడానే ఉంది. మూడో స్థానంలో హర్యానా, నాలుగో స్థానంలో జార్ఖండ్ నిలిచింది. రిఫార్మ్ ఎవిడెన్స్ స్కోర్, ఫీడ్ బ్యాక్ స్కోర్ అన్న అంశాలను పరిశీలించి ర్యాంకుల్ని నిర్ణయించారు. రాష్ట్రాలను టాప్ అచీవర్స్, అచీవర్స్, ఫాస్ట్ మూవర్స్ గా విభజించి ర్యాంకుల్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణ టాప్ అచీవర్స్ స్థానాల్లో న్నాయి.
ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్య సదస్సులు జరగడం, అనేక ప్రాజెక్టులు ఏర్పాటుకు సంబంధించి వేల కోట్ల రూపాయల మొత్తంలో ఒప్పందాలు చేసుకోవడం.. సులభతర వాణిజ్య విధానాలు ఉండటంతో.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్థానంలో ఏపీ నిలిచిందని.. కేంద్రం తెలిపింది. వాణిజ్యంలో పోటీతత్వాన్ని పెంచాలన్న ప్రధాన ఉద్దేశంతో రూపొందించిన ప్రణాళికయే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. వ్యాపార, పెట్టుబడి అనుకూల సంస్కరణలు వేగంగా కొనసాగించడానికి ప్రపంచబ్యాంక్ తో కలిసి.. కేంద్రం ఈ ర్యాంకులు ఇస్తోంది. ఈ ర్యాంకులు ప్రకటించండం ప్రారంభించిన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడింది. ఈ ర్యాంకుల్ని డీఐపీపీ వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూంటారు.ఆర్థిక సంవత్సరంలో జూన్ నుంచి మే మధ్య కాలంలోని డాటాను పరిగణనలోకి తీసుకొంటారు. అయితే ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన మీడియాలో ఏపీ ఎక్కడో ఏపీ పదిహేనో స్థానంలో ఉందని తెలంగాణ మొదటి స్థానంలో ఉందని… విస్త్రతంగా ప్రచారం అయింది. దీన్ని ఏపీ అప్పుడే ఖండించింది. ర్యాంకులు జూలైలో ప్రకటిస్తారన్న విషయాన్ని చెప్పింది. తమ విధానాలు ఇతర రాష్ట్రాలు కాపీ కొట్టకూడదన్న ఉద్దేశంతోనే వెబ్ సైట్లో అప్ లోడ్ చేయలేదని వాదించింది. చివరి ఫైనల్ ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది.
విభజన తర్వాత పారిశ్రామికంగా ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనప్పటికీ ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలతో.. పెట్టుబడిదారులు.. ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. కియా, హీరో, అశోక్ లేలాండ్ వంటి కంపెనీలతో ఆటోమోటివ్ రంగంలో, ప్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్ సీ ఎల్ వంటి వాటితో ఐటీ రంగంలో షియోమి, ఫాక్స్ కాన్ వంటి కంపెనీతో మొబైల్ రంగంలోని ఏపీ హబ్ గా మారుతోంది. దీంతో ముందు ముందు ఆంధ్రప్రదేశ్ దేశానికి పారిశ్రామిక చిరునామాగా మారే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణ కూడా ఏపీతో పోటీ పడుతోంది.