ఇప్పుడు తెలుగు వాళ్ల దృష్టి చాలావరకు నంద్యాల ఉప ఎన్నికపై కేంద్రీకృతమైంది. ఆదిలోనే అవాంచనీయమైన వాదోపవాదాలు, దూషణలూ ఉద్రిక్తత పెంచుతున్నాయనే ఆందోళనా వుంది. మరో వంక డబ్బు ప్రవాహంలా ప్రవేశిస్తోంది. ఒకవైపున ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి వర్గ సహచరులూ టిడిపి ముఖ్యనేతలు తిష్ట వేస్తే మరోవైపున ప్రతిపక్ష నేత జగన్ కూడా ప్రచారం ముగిసేవరకూ వుంటానని ప్రకటించారు. కాబట్టి ఇది వేడివేడిగానే గాక వాడివాడిగానూ వుండబోతున్నది. ప్రజల్లో మీడియాలో పార్టీల్లో వారి వారి అంచనాలు వున్నాయి. మరి రాజకీయంగా పరస్పరం ఘర్షించే ఆంధ్రజ్యోతి, సాక్షి దీనిపై ఎ లాటి కథనాలు ఇస్తున్నాయి? అన్ని కాకున్నా ముఖ్యమైన రెండు ఉదాహరణలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
నంద్యాలలో పార్టీ గెలుపుకోసం పాతిక మంది ఎంఎల్ఎలు ప్రచారం చేస్తున్నా టిడిపిలో తెలియని భయం నెలకొందని ఆంధ్రజ్యోతి-ఎబిఎన్ కథనం. క్షేత్రస్తాయిలో వాస్తవాలకు అమరావతికి వస్తున్న నివేదికలకు మధ్యన అంతరం ఆందోళన కలిగిస్తున్నదట. టీమ్ స్పిరిట్ లోపించిందట. ఎవి సుబ్బారెడ్డి అంటీముట్టనట్టుగా వుండటం, భూమా కుటుంబం ఆయనను పట్టించుకోకపోవడం ఫ్రభావం చూపొచ్చని తెలుగుదేశం వర్గాలు అనుకుంటున్నాయట.గ్రామస్థాయి కార్యకర్తలను కలుపుకుని పోవలసిన అవసరం ఎక్కువగా వుందట. ఇదీ ఎబిఎన్ కథనం.
ఇక సాక్షి ఛానల్ నంద్యాలలో వైసీపీ గెలుపుకోసం నిర్విరామ ప్రసారాలు చేస్తున్నది. అది సహజమే. ఆదివారం ఆగష్టు 6వ తేదీన సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి విలువలే గెలవాలి అంటూ తన త్రికాలం రాశారు. టిడిపి నుంచి తమ పార్టీలోకి వచ్చిన శిల్పా చక్రపాణిరెడ్డితో రాజీనామా చేయించడం ద్వారా జగన్ కొత్తవిలువలు నెలకొల్పారని పేర్కొన్నారు. ముందే రాజీనామా చేయడం హర్షనీయమే. వివిధ అంశాలు ప్రస్తావించిన తర్వాత ఆయన ఎన్నికల బలాబలాలు పలితాలపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. పెరుగుతున్న జగన్ ప్రాబల్యానికి బలమైన శిల్పామోహనరెడ్డి సొంతబలం తోడైతే విజయం సాధ్యం అని పేర్కొన్నారు. చివర భాగంలో కొచ్చే సరికి అన్ని చోట్లా గాని లేక ఫిరాయింపులు జరిగిన అన్ని చోట్లాగాని ఒకేసారి ఎన్నికలు జరిగివుంటే వైసీపీ విజయం ఖాయమై వుండేదని కాని ఒక్క నంద్యాలలోనే జరుగుతున్నందున చంద్రబాబు నాయుడు అలవాటైన రీతిలో సకల హంగులూ శక్తియుక్తులూ మోహరించారని పేర్కొన్నారు. మంత్రుల మకాం, జెజెరావు నాయకత్వంలో పర్యవేక్షణ కమిటీ కృషి వంటివాటిని ప్రస్తావించిన తర్వాత ” నంద్యాల ఎన్నిక రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో వైఎస్ఆర్సిపి విజయానికి నాంది పలకబబోతున్నదేమో చూడాలి. పలితం ఎలా వున్నప్పటికీ ఇది చారిత్రిక ఉప ఎన్నిక.. ” అంటూ మరొక వాక్యం రాసి ముగించారు.
వైసీపీపై ఒంటికాలితో లేచే ఆంధ్రజ్యోతి అటువైపు నుంచి జాగ్రత్తలు రాస్తే సాక్షాత్తూ వారి ఆద్వర్యంలోని పత్రికలో అత్యున్నత స్థానంలో వున్న వారు ఇలా ఆచితూచి రాయడం ఆసక్తికరంగా వుంది కదూ!