ఆంధ్రజ్యోతిలో అగ్ని ప్రమాదానికి అందరూ విచారించారు. ముఖ్యమంత్రులతో సహా సందర్శించారు. అంత ప్రమాదం జరిగినా పత్రిక ఆగకుండా తీసుకొస్తున్నందుకు అభినందించారు. అంతవరకూ బాగానే వుంది. మరి ఇప్పుడు పత్రిక ఎలా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తమ సచివాలయంలో స్థలం వాడుకొమ్మని ఆఫర్ చేశాయంటే ఆర్కే పట్టు తెలిసిపోతుంది. ఎపి సచివాలయం ఎలాగూ అమరావతికి వెళ్లినందువల్ల కంప్యూటర్లతో సహా ఇక్కడ ఖాళీగా వుండటంతో తాత్కాలికంగా ఉపయోగిస్తున్నారట. ఆంధ్రజ్యోతికి వున్న అనుబంధం రీత్యా అందులో పెద్ద ఆశ్చర్యం లేదు. కాని తెలంగాణ మంత్రులు కూడా తమ సచివాలయంలో గదులు వాడుకోవచ్చని సూచించారట. ఈ లోగా ఎపి స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంటి సమీపంలో తాత్కాలిక భవనం ఏర్పాటు చేసుకుంటున్నట్టు సమాచారం. ఇంకా కొన్ని కూడా పరిశీలనలో వున్నాయి. ఇవన్నీ గాక తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఒక స్థలం ఆఫర్ చేసిందని కూడా కథలు సంచారం చేస్తున్నాయి. కాలిపోయిన కార్యాలయాన్ని వదలిపెట్టి ఇలాటి ఏదో ఒక ప్రదేశానికి తరలిపోవడం మాత్రం ఖాయం.