వైసీపీ హయాంలో చాలా యాక్టివ్ గా ఉన్నారని వాళ్లకు మళ్లీ పోస్టింగులు ఎలా ఇస్తారని.. పొడిగింపులు ఎలా ఇస్తారని ఆంధ్రజ్యోతి రోజుకో కథనం రాస్తోంది. తాజాగా బుడితి రాజశేఖర్ అనే ఐఏఎస్ అధికారి వ్యవహారంలో రాసిన కథనం టీడీపీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయింది. ఆయన జగన్ రెడ్డి సర్వీస్ అధికారి అని ఆంధ్రజ్యోతి చెప్పుకొచ్చింది. గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారని రాసుకొచ్చారు. ఆయనకు ఏడాది సర్వీస్ పొడిగింపు ఇవ్వడం సరి కాదని…జగన్ ఇతరులపై వేధింపులకు పాల్పడిన వారికి ప్రాధాన్యత ఇస్తే.. చంద్రబాబు తనపై వేధింపులు పాల్పడిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని రాసుకొచ్చారు.
ఈ కథనంపై టీడీపీ వర్గాల్లో చర్చ జరిగింది. అసలు అధికారవర్గాల్లో ఏం జరుగుతుందో ఏమీ తెలియని వారికి ఇది కొత్తగా ఉంటుంది. కానీ మరో ఐఏఎస్ రిటైర్డ్ అధికారి పీవీ రమేష్ బుడితి రాజశేఖర్ కు మద్దతుగా సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు. ఆంధ్రజ్యోతి కథనాలను ఉద్దేశించి అవన్నీ తప్పుడు సమాచారం అని స్పష్టం చేశారు. బుడితి రాజశేఖర్ సూటిగా, స్పష్టంగా ఉండే అధికారి అని ఆయన జగన్ రెడ్డి హయాంలో ఏడాది పాటు పోస్టింగ్ లేకుండా ఉన్నారని గుర్తు చేశారు. జగన్ హయాంలో నిబంధనలకు అనుగుణంగానే పని చేశారు కానీ ఎక్కడా దారి తప్పలేదన్నారు. ఆయనకు ఏడాది పాటు సర్వీసు పొడిగించడం సమంజసమేనన్నారు.
పీవీ రమేష్ ప్రకటనతో.. ఆంధ్రజ్యోతి రాసిన కథనానికి.. అసలు జరుగుతున్న మ్యాటర్‌కు చాలా తేడా ఉందని టీడీపీ క్యాడర్ కు అర్థమవుతోంది. ఆ అధికారులు ఎలాంటి వారో టీడీపీ క్యాడర్ కు నేరుగా తెలియదు. మీడియా రిపోర్టు చేస్తేనే తెలుస్తోంది. అప్పట్లో తాము అలా రాశాం కాబట్టి ఆ అధికారి జగన్ రెడ్డికి సన్నిహితుడేనని ఇప్పుడు తీర్మానించి ఇలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్న వాదన ఎక్కువ మంది వినిపిస్తున్నారు. ఆయా అధికారుల గురించి ప్రభుత్వ పెద్దల కన్నా.. ఆంధ్రజ్యోతికే ఎక్కువ తెలుసా అన్న ప్రశ్న కూడా వస్తోంది.