హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఒక బాంబులాంటి కథనాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక ఇవాళ వెలువరించింది. యూపీఏ-1 హయాంలో కేంద్ర కార్మికమంత్రిగా ఉన్న సమయంలో ‘సహారా గ్రూప్’ కంపెనీకి లబ్ది చేకూర్చేలా కేసీఆర్ అసాధారణ, అనుచిత నిర్ణయాలు తీసుకున్నారని సీబీఐ ద్వారా మోడి ప్రభుత్వం గుర్తించినట్లు తమకు తెలిసిందంటూ ఇవాళ బ్యానర్ స్టోరీ ఇచ్చింది.
సహారా గ్రూప్‌కు చెందిన 5 కంపెనీలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రావిడెంట్ ఫండ్ స్వీయ నిర్వహణకు అనుమతి మంజూరు చేశారని పేర్కొన్నారు. ఈపీఎఫ్ పరిధినుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారని, సీసీఎఫ్‌సీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా కేసీఆర్ బేఖాతరు చేశారని ఆరోపించారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంవల్ల సహారా కంపెనీలకు చెందిన లక్షలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారని వారి వేతనాలనుంచి మినహాయించుకున్న పీఎఫ్ వాటా డబ్బులు సహారా ఖాతాలో జమ అయ్యాయని పేర్కొన్నారు. కంపెనీ వాటా ఏమందో తెలియదని, తదనంతరకాలంలో సహారా గ్రూప్ దివాళా తీయటంతో పీఎఫ్ ఖాతాలు స్తంభించి తమ డబ్బులుకూడా దక్కని స్థితిలో కార్మికులు లబోదిబో మంటున్నారని ఆంధ్రజ్యోతి రాసింది. కేసీఆర్ హయాంలో ఈఎస్ఐ భవన నిర్మాణాల కాంట్రాక్ట్‌లో అవినీతిపై సీబీఐ ఇప్పటికే దర్యాప్తు జరుపుతోంది. ఈ వ్యవహారంలో కేసీఆర్ వాంగ్మూలాన్ని గతవారం సీఎమ్ క్యాంప్ కార్యాలయంలో నమోదు చేసింది. తాజాగా సహారా విషయంలో కేసీఆర్ స్టేట్మెంట్ను తీసుకోవాలని సీబీఐ భావిస్తున్నట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది. ఏది ఏమైనా ఈ వార్త నిజమైతే కేసీఆర్ బాధితుడైన ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణకు, కేసీఆర్‌ను వ్యతిరేకించే అనేకమందికి పండగే. అందుకే మరి మీడియాతో పెట్టుకోవద్దనేది. కేసీఆరేమో అధికారం చేతికందిన ఉత్సాహంలో నాడు – మీడియాను భూగర్భంలో పాతేస్తానంటూ ధమ్కీ ఇచ్చి వారితోనే పెట్టుకున్నాడు. చివరికి ఏమవుతుందో చూడాలి.