ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టెన్షన్ పడుతున్నారో లేదో కానీ… ఆంధ్రజ్యోతి మాత్రం హైరానా పడిపోతోంది. ఈ నెల జీతాలు కష్టమంటూ.. ఓ కథనం ప్రచురించింది. ఒకటో తేదీ జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం పడుతున్న తిప్పల గురించి రాసుకొచ్చింది. వచ్చే రెండు, మూడు నెలల్లో.. పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని… ఆంధ్రజ్యోతి చెబుతోంది. జనవరిలో.. తల్లులకు అమ్మఒడి కింద నగదు ఇవ్వడం.. రైతు భరోసా రెండో విడత పంపిణీతో పాటు.. పలు రకాల పథకాలు, బిల్లులకు డబ్బులు చెల్లించాల్సి ఉందని గుర్తు చేసింది.
రైతు భరోసా పథకం కోసం ఆర్బీఐ వద్ద ఓడీ, వేస్ అండ్ మీన్స్ రూపంలో తీసుకున్న రుణానికి … ఈ నెలలో పన్నుల వాటాగా కేంద్రం నుంచి ఏపీకి వచ్చిన వాటాను.. ఆర్బీఐ జమ చేసేసుకుంది. దాంతో.. ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు, సామాజిక పెన్షన్లు, గ్రామ వాలంటీర్లకు జీతాలు, కొత్తగా నియమించిన గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా.. ఈ నెల జీతాలు ఇవ్వాల్సి ఉంది. గత నెలలో మొదటి తారీఖున దాదాపు లక్షమంది వరకూ ప్రభుత్వ ఉద్యోగులకు, వివిధ పద్దులు కింద చెయ్యాల్సిన బిల్లులకు చెల్లింపులు జరగలేదు. 10 తేదీవరకూ ఉద్యోగుల్లో చాలామందికి జీతాలు అందని పరిస్ధితి తలెత్తింది.
కేంద్ర గ్రాంట్లు, పన్నుల ఆదాయం కలుపుకుంటే.. నెలాఖరు వరకు…రూ. మూడు వేల కోట్లు జమయ్యే అవకాశం ఉంది. మరో మూడు వేల కోట్ల వరకూ.. జీతభత్యాలకు కావాలి. వాటి చెల్లింపుల కోసం.. అప్పులు తప్పవనే పరిస్థితి వచ్చిందని ఆంధ్రజ్యోతి చెబుతోంది. ప్రతి మంగళవారం బాండ్లు వేలం వేసి.. రూ. వెయ్యి కోట్లను ఏపీ సర్కార్ అప్పు తీసుకుంటోంది. మళ్లీ వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని వాడుకోవడం మినహా.. మరేమీ చేయలేని పరిస్థితి. ఇప్పటికే అప్పుల కోసం పలు బ్యాంకులకు ప్రతిపాదనలు పెట్టారు. అవి వస్తే.. ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లకుండా ఉండొచ్చన్న అంచనాలో ఉన్నారని చెబుతోంది. ఆంధ్రజ్యోతి చెబుతున్న ప్రకారం చూస్తే.. ఏపీ ఆర్థిక పరిస్థితి.. ముందుంది మొసళ్ల పండగన్నట్లే ఉంది.