హైదరాబాద్: మామూలుగా అయితే ఇలా కథనం రావటంలో విశేషమేమీలేదు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్‌గా వ్యవహరించాల్సిన మీడియా – ప్రభుత్వాల లోపాలపై, పొరపాట్లపై కథనాలు వెలువరించటం ప్రధాన కర్తవ్యం. అయితే తెలుగుదేశం పార్టీ సొంత మీడియా సంస్థలలాగా వ్యవహరిస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్ ఛానల్ ఇలాంటి కథనాలు వెలువరించటం విశేషం. వేమూరి రాధాకృష్ణ చేతుల్లోకి వచ్చిన దగ్గరనుంచి ఆంధ్రజ్యోతి తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇప్పుడున్నంత బాహాటంగా అప్పుడు సమర్థించలేదు. కేసీఆర్ ఏబీఎన్ ఛానల్ మీద నిషేధం విధించిననాటినుంచి మాత్రం బాహాటంగా టీడీపీని సమర్థించటం, బాకా ఊదటం మొదలయింది. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు తెలుగుదేశం మంత్రి ఒకరిపై ఏబీఎన్ ఛానల్లో ఒక విమర్శనాత్మక కథనాన్ని ప్రసారం చేయటంవెనుక మతలబు ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.
ఇంతకూ ఆ మంత్రి మరెవరో కాదు! ప్రత్యక్ష రాజకీయాలతో, ప్రజలతో ఏమాత్రం సంబంధంలేకుండానే ఒక్కసారిగా రాష్ట్ర మంత్రి అయికూర్చున్న నారాయణ. తనది పురపాలక శాఖ అయినప్పటికీ అన్ని శాఖలలోనూ జోక్యం చేసుకుంటున్నారని, సీఎమ్ తరహలో అన్ని మంత్రిత్వశాఖలను సమీక్షిస్తున్నారని ఆ కథనంలో ఆరోపణ. ఇతర శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌కూడా నిర్వహిస్తున్నారని, ఈయన పెత్తనంపై తోటిమంత్రులు భగ్గుమంటున్నారని ఆ స్టోరీలో పేర్కొన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు, అయ్యన్నపాత్రుడు నారాయణ బాధితులని చెప్పారు. ఆయన సీఎమ్‌కు సన్నిహితుడవటం, మరోమంత్రి గంటాకు బంధువవటంతో ఈ అతి జోక్యంపై మంత్రులు మింగలేక, కక్కలేక పరిస్థితిలో ఉన్నారని ఆ కథనం.
నారాయణ అతిజోక్యం సంగతి పక్కన పెడితే తెలుగుదేశాన్ని సొంత సంస్థలాగా భావించే ఆంధ్రజ్యోతి – ఏబీఎన్ ఏపీ ప్రభుత్వంలోని మంత్రిపై వ్యతిరేక కథనం ఇవ్వటానికి కారణాలను పరిశీలిస్తే రెండు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి – నారాయణమీద చంద్రబాబుకు ఎవరూ ఫిర్యాదు చేసే సాహసం చేయటంలేదుకాబట్టి పిల్లిమెడలో గంటకట్టే బాధ్యతను ఏబీఎన్ తరపున రాధాకృష్ణ తీసుకోవటం. రెండు – నారాయణ వ్యతిరేకవర్గం రాధాకృష్ణతో తమకున్న సాన్నిహిత్యంతో ఈ కథనం ప్రసారం చేయించటంద్వారా నారాయణ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేయటం.
నిజంగా నారాయణమీద విమర్శలు చేయాల్సివస్తే… గోదావరి పుష్కరాల నిర్వహణనంతా భుజానికెత్తుకుని, లోపభూయిష్టమైన ఏర్పాట్లతో మొదటిరోజే అంతపెద్ద దుర్ఘటన జరగటానికి కారణమయ్యారని విమర్శించాలి. కానీ ఆ విమర్శచేస్తే అది చంద్రబాబుకుకూడా చుట్టుకుంటుందనో, ఏమో దానిని ప్రస్తావించలేదు. ఇంతకూ ఈ కథనం ప్రసారం చేయటం వెనక రాధాకృష్ణ లక్ష్యం నెరవేరిందా, లేదా అనేది ప్రస్తుతానికయితే తెలియటంలేదు.