హైదరాబాద్: వీణ-వాణి సయామీ కవలలకోసం విరాళాలు సేకరించి స్వాహా చేశారని ‘నమస్తే తెలంగాణ’ పత్రిక చేసిన ఆరోపణలపై మొత్తానికి ‘ఆంధ్రజ్యోతి’ స్పందించింది. వీణ-వాణి కోసం సేకరించిన విరాళాలను భద్రంగా దాచామని, వారికి ఆపరేషన్ జరిగినప్పుడు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపింది.
నమస్తే తెలంగాణ పత్రిక చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఆంధ్రజ్యోతి ఇవాళ ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే!’ – ‘కారు కూతల నమస్తే’ అనే హెడ్డింగ్లతో ఒక కథనాన్ని ఇచ్చింది. వీణ-వాణిలకోసం తాము నిర్వహించిన లైవ్ కార్యక్రమంవలన రు.2,46,366 విరాళాలు వచ్చాయని ఆ కథనంలో తెలిపారు. వీణ-వాణి సర్జరీకి ఖర్చు భరిస్తామని నాడు ముందుకొచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదని, ఏ నిర్ణయమూ తీసుకోలేదని పేర్కొన్నారు. వారిద్దరూ హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలోనే పెరుగుతుండటంతో ఆ సొమ్మును తమ ఎకౌంట్స్లోనే వీణ-వాణి రిలీఫ్ ఫండ్ పేరిట ప్రత్యేక లెడ్జర్ ఖాతాలో చూపుతూ వస్తున్నామని తెలిపారు. కేవలం రు.2,46,366 మొత్తాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కాజేసిందంటూ నమస్తే తెలంగాణ ఆరోపించటం దాని అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.(అంటే చిన్న మొత్తాలను కాజేయరని ఉద్దేశ్యమా!)
రైతుకుటుంబాలకోసం విరాళాలు సేకరిస్తున్న కేసీఆర్ కుమార్తె కవిత, సీమాంధ్ర పారిశ్రామికవేత్తలనుంచి సొమ్ము రాబట్టటం మినహా ఒక్క పైసా అయినా ఇచ్చారా అని ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఈ కథనంలో ప్రశ్నించారు. వాణి-వీణ తండ్రి మురళీకి, రాధాకృష్ణకు మధ్య నమస్తే తెలంగాణ పేర్కొన్నట్లు ఎలాంటి ఫోన్ సంభాషణా జరగలేదని పేర్కొన్నారు. నవ్యాంధ్ర రాజధానికోసం విరాళాలు సేకరించగా, రు.2,57,48,253 మొత్తం వచ్చిందని, దానిని 2014 అక్టోబర్ 24వ తేదీన రాధాకృష్ణ స్వయంగా సెక్రటేరియట్‌కు వెళ్ళి చంద్రబాబుకు అందజేశారని, ఆ వార్త అన్ని పత్రికలలోనూ వచ్చిందని రాశారు. రైతులకోసం ప్రస్తుతం సేకరిస్తోన్న విరాళాల గురించి కూడా ఖచ్చితమైన లెక్కలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మీదే కాబట్టి, ఏదైనా అనుమానముంటే విచారణ జరుపుకోవచ్చని సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖరరెడ్డికూడా గతంలో తమను పట్టుకోవాలని చాలా ప్రయత్నించారని, కానీ ఏమీ చేయలేకపోయారని పేర్కొన్నారు. నమస్తే తెలంగాణను కేసీఆర్ విషపుత్రికగా అభివర్ణించారు.
మరోవైపు ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఇవాళకూడా ఆంధ్రజ్యోతిపై ఎదురుదాడి కొనసాగించింది. ‘కేడీలతో జట్టుకట్టు…అసత్యాల కనికట్టు!’ ‘ఇదీ రాధాకృష్ణ ఫార్ములా’.. అంటూ మొదటిపేజిలోనే ఒక కథనాన్ని ఇచ్చింది. కేసీఆర్‌పై జ్యోతి ప్రచురించిన కథనంలో వివరాలన్నీ తప్పులు ఉన్నాయని ఎత్తిచూపింది. మాయావతి సోదరుడు సిద్దార్థ కుమార్‌కు కేసీఆర్ 2004 మే నెలలో వీఆర్ఎస్ ఇచ్చినట్లు జ్యోతి రాసిందని, కానీ కేసీఆర్‌కు అప్పటికి కార్మిక శాఖ కేటాయించనే లేదని వివరించింది. నిజానికి కేసీఆర్ మంత్రిగా అక్రమం చేసిఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకుని ఉండేది కాదనికూడా పేర్కొంది.